‘తానా’లో మూడు ముక్కలాట అంటూ నాయకులు మూడు వర్గాలుగా చీలి సంస్థ భవిష్యత్తును గాలికి వదిలి తమ వర్గాధిపత్యానికై చేస్తున్న వివిధ ప్రయత్నాల గురించి ఇంతకుముందు ‘నమస్తే ఆంధ్ర’ స్పష్టంగా వివరించగా, ప్రస్తుత వ్యవహారాలు సరిగ్గా అదే విధంగా జరుగుతుండడం మిక్కిలి బాధ కలిగిస్తోంది. ప్రస్తుత మరియు గత అధ్యక్షుల వర్గాలు క్రిందటి ఎన్నికల్లో “చేంజ్” అంటూ కూటమి కట్టి, అప్పటి వరకు తమ ఎదుగుదలకు ఉపయోగించుకున్న పాత తరం అధిష్ఠానాన్ని ఓడించి, కొంత అభాసుపాలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే కాపురం మొదలకు ముందే, పెళ్లి పెటాకులైన ట్లు గెలిచిన కూటమి లోని రెండు వర్గాలు ప్రమాణ స్వీకారానికి ముందే కీచులాడుకుని రోజు రోజుకీ పగలు పెంచుకుని ‘ఉప్పు నిప్పు’ లాగా వ్యవహరించడంతో ‘తానా ‘పరిపాలన మరియు భవిష్యత్తు పరమ గందరగోళంగా తయారైయింది, ఒక సంవత్సర కాలంగా ఏమీ చేయలేక పోవడం ఇందుకు రుజువు.
‘తానా’ కోవిద్ వితరణ సరుకు బుగ్గిపాలు!!
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు కోవిద్ మహమ్మారి రక్షణకై అమెరికాలో సేకరించిన సుమారు 10 కోట్ల విలువైన సామాగ్రి సమస్తం విశాఖ దగ్గరలోని గొడౌన్స్ లో నిన్న బుగ్గిపాలు కావడం రెండు దేశాల తెలుగు ప్రజానీకానికి విస్మయం కలిగించింది. అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేవల నిమిత్తం చేరవేసిన అత్యంత విలువైన సామాగ్రి నయా పైసా కూడా ఉపయోగపడక పోగా ఇంతవరకు అక్కడకు చేర్చడానికి మరియు నిలువ చేయడానికి పెట్టిన ఖర్చుతో పాటు, ఇంత కాలం ఉపయోగించుకోలేక పోవడం, అసమర్ధతకు గాను నాయకత్వం పరువు గంగలో కలిసినట్లే. అంతేకాక వితరణ సామాగ్రి సేకరణ మీద, వాటిని పంచిపెట్టే అధికారం, ఖ్యాతి గురించి పోటీలు పడిన ‘తానా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ‘తానా’ ఫౌండేషన్ మరియు ఇతర నాయకులు ఉపయోగించలేకపోయిన అలసత్వానికి, అతీ గతీ చూడక తగలబడిపోయి నష్టపడిన దానికి భాద్యతను మాత్రం వేరేవాళ్ళ నెత్తి మీద రుద్దటానికి పడరాని పాట్లు పడుతుండటం నాయకత్వ స్వార్థ స్వభావాన్ని తేటతెల్లం చేస్తోంది
రెట్టింపైన నూతన ‘తానా’ సభ్యత్వాలకు ఓటు హక్కు హుళక్కి?!!
‘తానా’ సంస్థ ద్వారా తెలుగు ప్రజలకు, భాషకు మరియు సంస్కృతి సేవలపై కాకుండా సంస్థపై అధిపత్యం పొందడానికి అవసరమైన ఓట్ల కోసం సభ్యులను చేర్పించడం పై మాత్రం తీవ్రమైన పోటీలు పడటం ఎంతకైనా తెగించడం అందరికీ తెలిసిన విషయమే. భీకరమైన గత ఎన్నికల యుద్ధం తరువాత ఈ పిచ్చి పీక్స్ కు వెళ్లి మూడింటికి మూడు వర్గాలు ఎవరికి వారు నానా తిప్పలు పడి సుమారు 5 మిలియన్ డాలర్లకు పైగా స్వంత నిధులతో సాధారణ మరియు ఫౌండేషన్ డోనర్ సభ్యుల సంఖ్యను రెట్టింపు పైగా చేశారు. ఇల్లలకగానే పండగ కానట్లు ఈ సభ్యులకు ఓటు హక్కు రానట్లయితే స్వంతంగా ఖర్చు చేసిన మిలియన్ల కొద్దీ సొమ్మంతా కూడా కోవిద్ వితరణ సామాగ్రిలాగా బుగ్గిపాలే. ఓటు హక్కు రాకపోతే బాగుండని ఏదైనా ఒక వర్గం భావించి గమ్మున ఉందేమో తెలియదు
కానీ 2022 ఏప్రిల్ 30 లోపున ‘తానా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ‘నిరంజన్’ సారధ్యంలోని మెంబర్షిప్ వెరిఫికేషన్ కమిటీ నిర్ధారించకపోతే ఓటు హక్కు రాదనే విషయం వివాదరహితుడు అత్యంత సీనియర్ అయిన గత ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్’ శ్రీనివాస గోగినేని’ ‘తానా’ నాయకత్వానికి తెలియజేస్తూ వెలుగులోకి తేవంగానే ఇందులోని విషయ తీవ్రత మూలంగా దావానలంలా అంతటా వ్యాపించి నాయకత్వాన్నికంపింప చేసింది. తీవ్రమైన ఈ విషయాన్ని మసి పూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నాలు మొదలైనప్పటికీ బైలాలు స్పష్టంగా ఉన్నందు వల్లనూ, ఒక వర్గం ఇందులో లాభాన్ని ఆశిస్తున్నందననూ ఇంకా అప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే లీగల్ చర్యలు ఎవరైనా తీసుకుంటే మిగిలిన పరువు కూడా పోయే ప్రమాదం ఉన్నందున మెజారిటీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే. బాలట్ కలెక్షన్లతో చెలరేగుతూ కన్నూ మిన్నూ గానకుండా తెలుగు కమ్యూనిటీ కి కూడా వీరి పిచ్చిని సిలైన్ బాటిల్స్ తో ఎక్కిస్తున్న కారణంగా, ఈ మాత్రంగా కర్రు కాల్చిన వాత పడటం రోగానికి విరుగుడే.
వచ్చే ‘తానా’ కాన్ఫరెన్స్ అయినా జరగనిచ్చే పనేనా?:
‘తానా’ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేది రెండేళ్లకోసారి చేసే ‘తానా’ కాన్ఫెరెన్సు అనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఇంత గొప్ప కార్యక్రమాలను నిర్వహించే బ్రాండ్, డొనర్లు, సామర్ధ్యం పుష్కలంగా ఉండటం ‘తానా’ సంస్థకే సొంతం. కానీ ఆ విషయాన్ని విస్మరించి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నాయకత్వమంటే కొద్దిమంది స్నేహితుల సమూహం అని, బాలట్ కలెక్షన్లతో పదవులు పొందటమే పరమార్థమని అనుకుంటూ, పాంప్లెట్స్ మరియు మీడియాలో పేర్లు, ఫోటోలతో అల్పానందము పొందటమే గాని, సంస్థకు విశేష కృషి చేసిన మరియు ఇతర సీనియర్ సభ్యులతో సంప్రదించాలని కానీ, ముందు చూపుతో అనేక కార్యక్రమాలకు, కాన్ఫరెన్స్ లకు కావలసిన చర్యలను సకాలములో తీసుకోవాలనీ తెలిసే అనుభవం లేక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు టాస్కులు మిగిలిపోతున్నాయి. కోవిద్ అంటూ మొట్ట మొదటిసారి మిస్ కొట్టిన ‘తానా’ కాన్ఫరెన్స్ ఈ సారైనా కలసికట్టుగా పకడ్బందీగా నిర్వహిస్తారని ఆశించిన తెలుగు ప్రజానీకానికి మూడు వర్గాల సిగపట్ల తోను, అనుభవ లేమితోనూ, ముందు చూపు కొరవడి సంవత్సరం పూర్తయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు లేదు
ప్రస్తుత పరిపాలన సంగతేంటి ?!!
అనేక రకాల కార్యక్రమాలతో బిజీ గా ఉండాల్సిన మూడు ‘తానా’ కార్యవర్గాలు లోని నాయకులు మూడు వర్గాలుగా చీలి అసలు పనులను గాలికి వదిలేసి పూర్తైన ఒక సంవత్సరంలో చెప్పుకుంటానికి ఒక్క ఘానా కార్యమూ లేక వచ్చే ఎలెక్షన్ లో ఎలా గట్టెక్కాలా అని తెగ మధన పడిపోవడం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కనీసం చేర్చుకున్న సభ్యత్వాలను కూడా క్రమబద్దీకరించలేక, సమీకరించిన వితరణ సామాన్లను సంరక్షించుకొని ఉపయోగించుకోలేక ఇంకా కాన్ఫరెన్స్ వగైరా ముఖ్య పనులపై దిక్కుతోచక అలసత్వాన్ని అసమర్థతను ఒప్పుకోలేక సతతమవుతున్నట్లు ప్రత్యేకంగా చెప్పాలా. మరొక సీనియర్ నాయకుడు బైలాస్ కమిటీ చైర్మన్ అయిన ‘సతీష్ చిలుకూరి’ కూడా నాయకత్వానికి లేఖ రాస్తూ వ్యవహారశైలిపై ఇదే విషయాలపై తన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు.
ప్రస్తుత మూడు వర్గాల వ్యూహాలేంటి?!!
క్రితం ఎలక్షన్లలో దెబ్బతిన్న పాత అధిష్ఠాన వర్గం పరాజయ అనుభవాన్ని భరిస్తూ తిరిగి ప్రాభవం ఎలా పొందాలో వ్యూహాల్లో ఉన్నప్పటికీ సరైన అనుచర వర్గం కొరవడి, అలాగే పెద్దరికం తో ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ ఆలోచనలతో ఇప్పటికైనా నిజమైన ‘తానా’ సేవకులను అందలమెక్కించి పేరు తెచ్చుకునే ఆలోచనగాక చుట్టూతా తిరిగే భజనపరులనే టీం గా భావించడం ‘కుక్క తోక వంకరే’ అనేటట్టుగా ఉంది. పైగా ఓడిపోయిన అధ్యక్ష అభ్యర్థి నాయకత్వ పటిమ, సమయస్ఫూర్తితో కమ్యూనిటీని కలుపుకోవడం కంటే అందరికంటే ముందు కొద్దిగా సభ్యత్వాలను చేర్చుకొని పోటీ పూర్తయిపోయినట్లై భ్రమ పడడటం మయసభలో దుర్యోధనుడు భంగ పడ్డట్లే అవుతుందేమో చూసుకోవాలి. ఇక మిగిలిన, గతంలో గెలిచిన “చేంజ్” పానెల్ నిట్టనిలువుగా చీలి తమలో తాము కొట్లాడుకుంటూ విజయ ఫలాలను ఎవరికీ కొరగాకుండా చేసుకుని ఒకరిని ఒకరు ఓడించుకోవడానికి, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఓడించిన వారితోనే కలిసిపోవడానికి తాపత్రయపడి పోవడం వీరి వ్యక్తిత్వాలకు ఎంత అవమానమో కూడా గమనించలేని పరిస్థితికి వీరి స్నేహితులే సిగ్గుపడుతున్నారు.
వీరిలో ప్రస్తుత అధ్యక్ష వర్గం పరిపాలన సజావుగా సాగించలేక, వచ్చే ఎలక్షన్ కు సరైన నాయకుడు లేక, తమలో కొద్ది మందికి కావలసిన పదవుల కోసం కుదిరితే గత అధిష్ఠానం కొలువుకై ముందుగా ఖర్చీఫ్ వేసినప్పటికీ తప్పకపోతే మరల గత అధ్యక్ష వర్గం తో కలవడానికి కూడా ఎటువంటి సిద్ధాంతాలు లేని తమ విధానం చాలా అనువుగా ఉంది. ఇక “చేంజ్” పానెల్ లో మిగిలిన గత అధ్యక్ష వర్గం కప్పదాటు నాయకుల జోడు సారధ్యంలో రాజకీయ ఎత్తులతో తలమునకలుగా ఉంటూ వచ్చే ఎన్నికలకు గుంభనగా తయారవుతూ ముందుగా పాత అధిష్టానానికి కన్ను కొడుతూ అదే సమయంలో ఎందుకైనా మంచిదని నొసటితో ప్రస్తుత అధ్యక్ష వర్గానికి కూడా మళ్లీ కలవడానికి సంకేతాలు పంపుతోంది
మొత్తానికి నాయకత్వం లోని ప్రతి వాడు ఇంచుమించుగా ఇలా ఉన్నాడు-
“మనిషిలోన ఇంకో మనిషి ఉన్నావు, నువ్వు మామూలు మనిషి కాదయ్యా, మాటకారి వాడవయ్యా, మమ్ములను మాయ చేస్తూ ఉన్నావయ్యా! “
వెరసి “చేంజ్” పానెల్ లోని రెండు వర్గాలు విడివిడిగా పాత అధిష్ఠానం కు పంపుతున్న సందేశం:
“అయినదేదో అయినది, మనసు తిరిగి నీ వశమవుతున్నదీ-మిమ్ము చూడగానే, మా మది పరవశమవుతున్నదీ! “
మరి గత అధిష్టానం ఇంకా తగ్గని గత వెన్నుపోటు నొప్పితో కలగలసిన క్వశ్చన్ మార్క్ ఫేస్ తో?
“ఎలా దెబ్బ కొట్టారో తెలియకున్నది, మీరు ఎక్కడ నేర్చుకున్నారో తోచకున్నదే అబ్బబ్బో..
ఇంకా ఎలా నమ్మాలో తెలియకున్నది, మళ్లీ ఎక్కడ ముంచుతారో తోచకున్నదే అయ్యయ్యో”
ఇదంతా గమనిస్తున్న ఇతర సీనియర్ సభ్యులు, మిగతా నాయకులు మూడు వర్గాల గురించి ఇలా అనుకుంటూ ఉండొచ్చు
“పైన పటారం లోన లొటారం, ఈ జగమంతా డంబాచారం, తందానా “తానా” తందానా “
మరి వచ్చే ఎన్నికల వరకు మనం–
“దాగుడు మూతలు దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక కోర్, ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్, గప్ చుప్”