సీఎం జగన్ హయాంలో వైసీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై రాజా చేయి చేసుకున్న ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. తనను జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు రాజా తనను పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే తన చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో సూర్య కిరణ్ పేర్కొన్నారు. సూర్యకిరణ్ కు మద్దతుగా 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం విశేషం. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు సంబంధించి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెబుతుండగానే తనపై ఆయన దాడి చేశారని చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అధికార వైసీపీ పార్టీ నాయకుల ఉన్మాదం కట్టలు తెంచుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ అసెంబ్లీ రౌడీలు పడ్డారని ఫైర్ అయ్యారు. తన అనుచరుల బిల్లులు క్లియర్ చేయకపోవడంతోనే పోలవరం ఏఈ సూర్యకిరణ్ ను వైసీపీ రౌడీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టారని ఆరోపించారు.
మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇంజినీరుపై దాడి జరిగినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడే ఉద్యోగ సంఘాల నాయకులు ఈ దాడిని ఖండించకపోవడం అన్యాయమని అన్నారు. సూర్యకిరణ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీర్ పై దాడికి పాల్పడిన జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్ట్ చేసి, బాధితుడు సూర్యకిరణ్ కు న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.