టీపీసీసీలో ఏం జరుగుతోంది !తెలంగాణ పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి లేకుండానే చింతన్ శిబిర్ జరుగుతోంది. ఆ విధంగా టీకాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అన్నది కూడా ఇప్పుడొక స్పష్టత లేకుండాపోయింది. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ వచ్చేదాకా అయినా ఆగాల్సింది అన్న వాదన వినిపిస్తున్నా.. మేడ్చల్ కేంద్రంగా చింతన్ శిబిర్ నిర్వహణ సాగుతోంది. దీనికి సీనియర్ లీడర్ మల్లు భట్టు విక్రమార్క సారథ్యం వహిస్తున్నారు.
తెలంగాణలో పార్టీ భవిష్యత్, రానున్న కాలంలో నడుచుకునే విధంగా, రాజకీయం, సామాజికం అన్న అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఆరు కమిటీల నేతృత్వంలో రెండ్రోజుల పాటు (బుధ,గురువారాలు) సాగుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. ఏఐసీసీ ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్న ఈ అంతర్మథనానికి రేవంత్ లేకపోవడమే ఓ విడ్డూరం.
ఇక కాంగ్రెస్లో ఎప్పటి నుంచో తామే అనుకుంటున్న నేతలూ, ఇకపై అంతా తామే అని భ్రమ పడిపోతున్న నేతలూ రేవంత్ వర్గానికి చెక్ పెట్టేద్దాం అని భావిస్తున్నారని ఓ టాక్. ఆ విధంగా చూసుకున్నా రేవంత్ లేని సమయంలో చింతన్ శిబిర్ఏర్పాటు చేసి ఉంటారని ఓ అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీలో ఇప్పటిదాకా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, మల్లు భట్టీ విక్రమార్క, జానా రెడ్డి లాంటి వారే అంతా తామే అయి నడిపించిన దాఖలాలు ఉన్నాయి.
వీహెచ్ తో సహా ఇలాంటి పనులే చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రాకతో ఆయన సీనియర్లను కాదని దూసుకుపోతున్నారన్న వాదన ఉంది. అందుకే ఆయనకు చెక్ పెట్టేందుకే ఊళ్లో లేని సమయంలో ఈ చింతన్ శిబిర్ నిర్వహించి ఉంటారన్న అభిప్రాయం ఒకటి రేవంత్ వర్గం నుంచి వస్తోంది.
ఏదేమయినప్పటికీ పార్టీ తీసుకునే నిర్ణయాలను అంతా గౌరవించాల్సిందేనని, రేవంత్ వర్గం అలజడులు కానీ అధిక ప్రసంగాలు కానీ చేయడానికి వీల్లేదని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. మరి! ఇవాళ్టితో ముగియనున్న శిబిరం రేపటి నుంచి ఏ స్టాండ్ తో పనిచేయనుందో ?