పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ కావడానికి ముఖ్య కారణం.. దువ్వాడ జగన్నాథం (డీజే) మూవీనే. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ కాకపోయినా.. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఆ చిత్రానికి పూజా హెగ్డే గ్లామర్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటనడంలో సందేహం లేదు.
అంతకంటే ముందు ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించినప్పటికీ.. ఆ చిత్రాలు ఆమె కెరీర్‌కు ఎంతమాత్రం ఉపయోగపడలేదు. పైగా తిరిగి బాలీవుడ్‌కు వెళ్లిపోయి రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంది. అలాంటి టైంలో డీజే మూవీ పూజాకు ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్లో ఆమే నంబర్ వన్. తన కెరీర్‌కు అంతగా ఉపయోగపడ్డ సినిమా అందించిన హరీష్ శంకర్ మీద పూజాకు ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే తన రేంజికి గద్దలకొండ గణేష్‌లో చేసిన పాత్ర చిన్నదే అయినా ఒప్పుకుంది.
ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించనున్న కొత్త సినిమా భవదీయుడు భగత్‌సింగ్‌కు కూడా పూజానే కథానాయికగా ఎంచుకోవడం తెలిసిందే. దీని గురించి ప్రకటన వచ్చి ఏడాది దాటింది. కానీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఐతే సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేకపోవడం, వేరే సినిమా ఆఫర్ల మీద ఇది ప్రభావం చూపిస్తుండటంతో పూజా ప్రస్తుతానికి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కోసం అనుకున్న డేట్లను ఆమె విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల జేజీఎం కోసం కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆమె పవన్ సినిమాలో లేనట్లే అంటున్నారు. తాను ఎలాగూ ఈ సినిమా కమిట్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నానని, మూడేళ్లకు పైగా వేరే సినిమా చేయకుండా దీని కోసం ఎదురు చూస్తూ ఉన్నానని, మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని హరీష్.. పూజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మళ్లీ సినిమా మొదలయ్యే సమయానికి అవకాశం ఉంటే పూజా నటిస్తుందట. లేదంటే మరో హీరోయిన్ని చూసుకోవాల్సిందే.