వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు అలియాస్ అనంత ఉదయ్ భాస్కర్ పై హత్యారోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై తీవ్ర ఆరోపణలు రావడం, అనంత బాబును అరెస్టు చేయడం సంచలనం రేపింది. అయితే, ఆరోపణలు వచ్చిన నాలుగు రోజుల వరకు అనంతబాబును పోలీసులు అసలు అరెస్టు చేయలేదు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడంతో చివరకు పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు.
జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలకు అనంతబాబు బినామీ అని, అందుకే ఈ కేసులో అనంతబాబును తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే మృతుడు సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఆవిడకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు, సుబ్రహ్మణ్యానికి మధ్య వ్యక్తిగత కలహాల వల్ల ఆ హత్య జరిగిందని, ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలా ఉద్యోగం ఇవ్వడం ద్వారా ఈ హత్య ప్రభుత్వ అలసత్వం వల్ల జరిగిందని అంగీకరించినట్లేనన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవా అని నిలదీస్తున్నారు. ఇలా ఉద్యోగాలివ్వడం ద్వారా మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ ఏం సందేశం ఇస్తోందని మండిపడుతున్నారు.
ఈ హత్యా రాజకీయాలు, అప్పులు, ఆర్థిక అవకతవకలతో అసలు ఆంధ్రప్రదేశ్ ఎటు పోతుందో అర్థమవుతోందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళున్న కబోదులారా…మీకు ఏం అన్యాయం జరుగుతుందో తెలుస్తోందా అంటూ ప్రజలనుద్దేశించి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. #JaganCheatedAP #SaveAPFromJAGAN లను ట్రెండ్ చేస్తున్నారు.