సీఎం జగన్, మాజీ మంత్రి కొడాలి నానిలతో పాటు వైసీపీ నేతలపై టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో మహిళా నేతగా దివ్యవాణి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అయితే, హఠాత్తుగా ఈ రోజు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
అయితే, ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ఆమె దానిని డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. తొలుత రాజీనామా ట్వీట్ చేసిన దివ్యవాణి…ఆ తర్వాత తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ రోజు సాయంత్రిం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, పార్టీపై దివ్యవాణి ఇలా వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. రెండు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీపై దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మహానాడులో తనకు అవమానం జరిగిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి తాను నిస్వార్థంగా పని చేస్తున్నా తనకు గుర్తింపే దక్కడం లేదని అన్నారు. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో తనలాంటి కళాకారులకు సరైన స్థానం లేకపోవడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి అధికారం లేని అధికార ప్రతినిధిగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్తో గానీ, మాజీ మంత్రి కొడాలి నానితో గానీ తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని దివ్యవాణి చేసిన వ్యాఖ్యలతో ఆమె వైసీపీలో చేరిపోతున్నారన్న వాదనలు వినిపించాయి.
అయితే, ఈ రోజు రాజీమానా ట్వీట్ పెట్టిన వెంటనే…దివ్యవాణితో టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. అర్జునుడితో మాట్లాడిన తర్వాతే దివ్యవాణి రాజీనామా ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ రోజు సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో దివ్యవాణి ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.