వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, జగన్ మూడేళ్ల పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ టీడీపీ సహా విపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు చార్జిషీట్ విడుదల చేశారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు పోయిందని అచ్చెన్న మండిపడ్డారు.
ఏపీలో విధ్వంసంతో పాలనను ప్రారంభించిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని అచ్చెన్న ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్లో రాష్ట్రం రివర్స్ గేర్ లో వెళ్లిందని, మోసపూరిత సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలకు జగన్ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి మీట నొక్కేందుక సీఎం అవసరం లేదని, ఒక సామాన్యుడుంటే చాలని ఎద్దేవా చేశారు. సొంత మనుషులకు జగన్ నిధులు దోచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో సన్ రైజ్ ఏపీగా ఉన్న రాష్ట్రం… జగన్ పాలన నేరాలు ఘోరాల మయంగా మారిపోయిందని మండిపడ్డారు.
వైసీపీ మంత్రులు నోరులేని మూగ జీవులని , రాష్ట్రంలో నలుగురు రెడ్లు రాజ్యాధికారం చెలాయిస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రులకు అధికారాలు, సామాజిక న్యాయం ఎక్కడ అమలవుతోందని ప్రశ్నించారు. మూడేళ్లలో ప్రభుత్వం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిందని విరుచుకుపడ్డారు. వైజాగ్ ను ఐటీ నగరంగా తీర్చిదిద్దేందుకు లోకేశ్ ప్రయత్నించారని, కానీ, ఒక్క ప్రాజెక్టును కూడా జగన్ విశాఖకు రప్పించలేదని ఆరోపించారు.
పెట్రోలు, డీజిల్ ధరల సెస్సు తగ్గించాలని ప్రధాని కోరినా జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూముల రిజిస్ట్రర్ ధరలను పెంచారని, చివరకు చెత్త పన్ను కూడా వేసి ప్రజలపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను కప్పిబుచ్చుకునేందుకే బస్సు యాత్రలు చేపట్టారని అన్నారు. అందుకే, ఆ యాత్రలను ప్రజలు చీదరించుకున్నారని పేర్కొన్నారు. మహానాడుకు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.