మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా గుండెపోటుతో మొదలైన వివేకా మర్డర్ మిస్టరీ సినిమా….ఆఖరికి గొడ్డలిపోటు దగ్గర ఆగింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రువర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలం తర్వాత ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ…ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితుల పాత్రపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే సీబీఐకి సాక్ష్యమిచ్చిన పలువురు సాక్ష్యులు, జైలులో ఉన్న నిందితులు, అనుమానితుల భద్రత కీలకంగా మారింది. మొద్దు శీను తరహాలో వివేకా కేసులోనూ నిందితులకు ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వరకు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో, ఈ కేసులో ప్రధాన సాక్ష్యులుగా ఉన్న దస్తగిరి, వాచ్ మెన్ రంగన్నలకు భద్రత కల్పించాలని సీబీఐ కోరగా..కడప కోర్టు ఆదేశాలతో వారిద్దరికీ వన్ ప్లస్ వన్ గన్ మెన్లను పోలీసు శాఖ కేటాయించింది.
అయినప్పటికీ వారికి ప్రాణహాని ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దస్తగిరి తన భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచుగా తనను టార్గెట్ చేసుకొని కావాలని గొడవ పడుతున్నాడని ఆరోపించారు.
ఏదో ఒక విధంగా తనను చంపాలని గోపాల్ చూస్తున్నాడని ఆరోపించారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నందున తనను హత్య చేయాలనుకుంటున్నారని దస్తగిరి ఆరోపించారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని, తనపై తప్పుడు కేసులు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు కూడా చెప్పానని దస్తగిరి ఆరోపించారు.