వివాదాలు అన్నవి అన్నీ మంచినే పెంపొందిస్తున్నాయా? లేకా ఉద్దేశ పూర్వక వివాదాల కారణంగా పార్టీలు మైలేజీలు పెంచుకుంటున్నాయా? ఏదేమయినప్పటికీ కవితక్క ఓ వివాదంలో ఇరుక్కుపోయిన వైనం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. జస్ట్ ఆమె టైం పాస్ కోసం ట్విటర్ లో ఉంచిన పోస్టు వివాదంకు తావిచ్చి అనేక విమర్శలను పోగేసుకుని నిన్నటి వేళ నిన్నటి వారాంతాన తెలంగాణ శ్రేణులకు కాస్త ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టింది.
పదవుల్లో ఉన్నవారికి ప్రజాక్షేమం పట్టకపోవడంతోనే ఈ విధంగా ఆటవిడుపు మాటలు చెబుతూ, పోస్టులు ఉంచుతున్నారనే భావనతో సోషల్ మీడియాలో ఓ వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఇదే సందర్భంలో తెలంగాణ జాగృతి కూడా అప్రమత్తమై కొన్ని మాటలు కవితక్కకు మద్దతుగా పలికింది. దీంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచి ఆగింది. ఆదివారం ఎలా ఉన్నా వివాదాలతోనే నిన్నటి వేళ ఆరంభం అయింది. ఆదివారం ఎలా ఉన్నా టీఆర్ఎస్ శ్రేణుల ఆశలను అడియాశలు చేస్తూ ముగిసింది.
ఓ వైపు కవితక్క మరోవైపు మల్లారెడ్డి వివాదాల్లో ఇరుక్కున్నారు. పాపం! ఈ ఆదివారం అధికారం ఉన్నోళ్లకు పెద్దగా ఏ వరాలూ ఇవ్వలేకపోయిందన్న వాదన కూడా విపక్షాల నుంచి వినిపిస్తోంది. ఏదేమయినప్పటికీ బాధ్యత గల పదవుల్లో ఉన్నవారంతా ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని ఓ వాదన మరోసారి నిరూపణకు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా అర్థం అవుతోంది.
ఆదివారం పదవినోదం పూర్తిగా నింపకుండానే ఐ గివ్ అప్ అని పేర్కొంటూ ఓ పోస్ట్ ట్విటర్ లో పెట్టారు కవిత. ఈనాడు పదవినోదంలో కొన్ని గడులు పూర్తి చేయకుండానే ఆమె ఆ విధంగా పోస్టు పెట్టడంతో మేడమ్ మీరు ఈనాడు కాదు నమస్తే తెలంగాణలో ఉన్న పదవినోదంను పూర్తి చేయండి అంటూ సెటైర్లు వచ్చాయి. అంతేకాకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పదవినోదాలకు ప్రాధాన్యం ఇస్తూ కాలక్షేపం చేయడంపై కూడా సెటైర్లు వచ్చాయి.
ఒకరు విదేశాల్లో కాలం గడిపేస్తే, మరొకరు ఫాం హౌస్ లో కాలం నెట్టుకువస్తున్నారు అని తండ్రీ కొడుకులకు కూడా కౌంటర్లు ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పదవినోదం చూడడం పదవిలో ఉన్న వారంతా వినోదానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తాము అర్థం చేసుకోగలమని అంటున్నారు.