ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలాచోట్ల టీడీపీ మద్దతున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పుంగనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్ పత్రాలు లాక్కోబోయిన వైసీపీ నేతలకు అంజిరెడ్డి ఎదురొడ్డి నిలబడిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, వైసీపీ ఈ తరహా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ముందే ఊహించిన టీడీపీ అధినేత చంద్రబాబు….ఈ ఎన్నికల్లో ఆన్ లైన్లోనూ నామినేషన్లు వేసేందుకు అనుమతించాలని ఎస్ఈసీని కోరారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సూచనను తమిళ స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తూ.చ తప్పకుండా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను చంద్రబాబు వీరాభిమాని అని గతంలో పలుమార్లు చెప్పిన కమల్…తాజాగా తన అభిమాన రాజకీయ నేత ఆలోచనను కూడా ఆచరణలో పెడుతున్నాడు. తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తు రుసుముగా రూ.25 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. పార్టీయేతర నేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
తమిళనాడు పుదుచ్చేరిలో మేలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, తమిళనాడులోని 234 నియోజక వర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో కమల్ తో పాటు నేతలంతా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన పార్టీ తరఫున పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలని కమల్ ప్రకటించారు. అంతేకాదు, అప్లికేషన్ ఫీజు రూ.25వేలుగా నిర్ణయించారు. మరి, కమల్ పెట్టిన కొత్త ప్రతిపాదనకు రెస్పాన్స్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, కమలహాసన్ తన కాలుకు శస్త్ర చికిత్స చేయించున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోన్న కమల్… వచ్చే నెల నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముందట. ఆపరేషన్‌కు ముందు కూడా చాలా ప్రాంతాల్లో పర్యటించిన కమల్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మరి, రాబోయే ఎన్నికల్లో కమల్ పార్టీ ఎంత వరకు రాణిస్తుందో వేచి చూడాలి.