విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ దివంగత మహానేత ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. శక పురుషుడి శత జయంతి వేడుకలు పేరుతో టీడీపీ ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అన్నగారి స్వగ్రామం అయిన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బాలయ్య బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోని చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించినట్లు బాలయ్య చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఈ విగ్రహం ఏర్పాటు చేస్తారని చెప్పారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని , తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారని అన్నారు. 2 రూపాయాలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత అన్నగారిదేనని గుర్తు చేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తెలుగు మాట్లాడే వారి ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ కొలువై ఉన్నారన్నారు. ప్రపంచ పటంపై తెలుగు సంతకం చేసిన మహా మనిషి ఎన్టీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్న ఆయనకు వందనాలని అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తరువాతనే వెండితెర వైభవం మొదలైందని, నటుడిగా, దర్శక నిర్మాతగా తెలుగు సినిమాలను ప్రభావితం చేశారని అన్నారు.
అంతేకాదు, సమర్ధుడైన రాజకీయనాయకుడిగా కూడా రాజకీయాలను ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు. అన్నగారి తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని, కానీ, ఇపుడు రాష్ట్ర పరిస్థితి తలచుకుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడులో ఈ విషయం గురించి పూర్తిగా మాట్లాడతానని అన్నారు.