#EmPeekaleruBrother.. నిన్న సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ రోజు ఉదయానికి దీని మీద ట్వీట్లు వేలను దాటి లక్షల్లోకి వెళ్లిపోయాయి. ఇండియా లెవెల్లో ఇది టాప్‌లో ట్రెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ మీద ఐడియా ఉన్న వారికి ఇది ఎవరు చేస్తున్నారని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
అల్లు అర్జున్ అభిమానులు, వారికి మద్దతుగా నిలుస్తున్న మెగా ఫ్యామిలీ యాంటీ ఫ్యాన్స్ కలిసి ఈ హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అందులో చాలా దారుణమైన పోస్టులు ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ ఛరణ్లను కించపరుస్తూ.. అదే సమయంలో అల్లు అర్జున్ను ఎలివేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికంతటికీ కారణం.. తాజాగా మెగా అభిమానులు పెట్టుకున్న ఓ సమావేశంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్.. బన్నీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే.
చిరంజీవి వల్ల, మెగా అభిమానుల వల్ల హీరోగా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు ఇప్పుడు వీరిని లెక్క చేయట్లేదని, అతణ్ని మెగా అభిమానులు మోయాల్సిన అవసరం లేదని రవికుమార్ వ్యాఖ్యానించడం, సమావేశంలో పాల్గొన్న అభిమానులు మద్దతుగా నినాదాలు చేయడంతో వివాదం రాజుకుంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా.. దానికి ఓ వర్గం అభిమానులు మద్దతునివ్వగా.. బన్నీ అభిమానులు మంటెత్తిపోయారు. ఈ నేపథ్యంలోనే వారికి రిటార్ట్ ఇస్తూ.. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. ఓవైపు చిరు, పవన్, చరణ్ చేసిన హిందీ చిత్రాలు డిజాస్టర్లయితే.. ‘పుష్ప’ సినిమాతో బన్నీ నార్త్ ఇండియాలో ప్రకంపనలు రేపి అక్కడ పెద్ద స్టార్‌గా అవతరించిన నేపథ్యంలో అసూయతోనే ఇలా అతడిపై విషం కక్కుతున్నారంటూ.. ఎంతమంది ఒక్కటైనా బన్నీ ఎదుగుదలను ఆపలేరని వాళ్లు పోస్టులు పెడుతున్నారు.
సందట్లో సడేమియా అన్నట్లు మెగా యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా బన్నీ అభిమానులకు వంత పాడడం మొదలుపెట్టారు. బన్నీకే తమ మద్దతు అంటూ.. చిరు, పవన్, చరణ్‌లను కించపరుస్తూ వాళ్లు కూడా ఇదే హ్యాష్ ట్యాగ్ మీద పోస్టులు పెడుతున్నారు.