దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం స్కిన్ షోనే నమ్ముకొని చాలామంది హీరోయిన్లు రాణిస్తోన్న ఈ జనరేషన్ లో తన అందం, అభినయంతో అలరిస్తోన్న ఈ తమిళమ్మాయికి యూత్ ‘ఫిదా’ అయిపోయారు. కేవలం తన టాలెంట్ నే నమ్ముకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి తన క్యారెక్టర్ల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంది.
‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే…’అంటూ అదిరిపోయే స్టెప్పులేసిన సాయి పల్లవి కోట్లమందిని ఫిదా చేసింది. ఇక, ‘సారంగ దరియా” అంటూ జానపద సాహిత్యంతో వచ్చిన పాటలో నెమలిలా నాట్యం చేసిన సాయి పల్లవి యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటనకు విమర్శకులూ ప్రశంసలు కురిపించారు. ఇలా ఆన్ స్క్రీన్ పైన సింపుల్ గా ఉండే సాయి పల్లవి…ఆఫ్ స్క్రీన్ లోనూ అంతే సింపుల్ అని చాలా సార్లు ప్రూవ్ చేసింది.
ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా రైతు కూలీగా మారిన ఈ స్టార్ హీరోయిన్ పొలంలో పసుపు కొమ్ములు ఏరిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇలా, తన కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించిన సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు, ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాయి పల్లవికి ఓ ప్రశ్న ఎదురైంది. ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మామ’ తరహా ఐటం సాంగ్స్ లో అవకాశం వస్తే నటిస్తారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానమిచ్చింది.
ఐటం సాంగులు తనకు కంఫర్ట్ గా ఉండవని, అలాంటి ఆఫర్లు వచ్చినా తాను చేయనని సాయి పల్లవి తేల్చి చెప్పేసింది. కాస్ట్యూమ్స్, డ్రెస్ సరిగా లేకుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యమని… రెండింటిలో ఏది లేకపోయినా జీవితం సంపూర్ణం కాదని చెప్పుకొచ్చింది.