ఏపీ సీఎం జగన్ కు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పేరున్న అదానీకి అప్పణంగా గంగవరం పోర్టులో వంద శాతం వాటాను జగన్ కట్టబెట్టిన వైనంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇక, ఇటీవల ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ భార్యకు దక్కుతుందని ప్రచారం జరిగినా..చివరకు అది వర్కవుట్ కాలేదు.
ఈ క్రమంలోనే జగన్, అదానీలు మరోసారి విదేశాల్లోనూ భేటీ అయ్యారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తొలి రోజు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. ఇక, డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో కూడా జగన్ సమావేశమయ్యారు.
తమ రహస్య వ్యాపార లావాదేవీలు, క్విడ్ ప్రోకో వ్యవహారాలపై చర్చించారన్న ప్రచారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను హస్తగతం చేసుకున్న అదానీ…ఏపీలో మరి కొన్నింటిని కాజేయడానికి జగన్ తో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇక, ఇటీవల తన భార్యకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై కూడా వారిద్దరూ చర్చింనట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా…విదేశాలలోనూ ఈ ఇద్దరు బిజినెస్ మ్యాన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక, దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను జగన్ ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అక్కడ ఏపీ తరఫున ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో జగన్ పాల్గొన్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది.