టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దత్తపుత్రుడంటూ జగన్, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు పవన్ కూడా జగన్ ను సీబీఐ దత్తపుత్రుడంటూ కామెంట్లు చేస్తూ పంచ్ లు వేస్తున్నారు. తనను దత్తపుత్రుడు అంటే తాను జగన్ అండ్ టీం ను చర్లపల్లి షటిల్ టీం అంటానని పవన్ గట్టిగానే స్పందించారు. ఇక, తమ అధినేతను విమర్శిస్తున్న జగన్, వైసీపీ నేతలపై జనసేన నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
సీబీఐకి దత్తపుత్రుడు మీరా.. మేమా? తమ నాయకుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరికీ చెప్పనక్కర్లేదని, మీరు సీబీఐకి చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు. దావోస్ పర్యటనకు సీఎం హోదాలో జగన్ వెళ్లాలన్నా పది రోజుల పాటు కోర్టు పర్మిషన్ తీసుకోవాలని, పవన్ ఎక్కడికెళ్లాలన్న స్వేచ్ఛగా వెళ్లగలరని అంటున్నారు. జనం సొమ్ముతో లండన్ పర్సనల్ టూర్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన జగన్ కాస్ట్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై సీపీఐ జాతీయాధ్యక్షుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ అయితే.. మోడీకి సీఎం జగన్ దత్తపుత్రుడు అంటూ చురకలంటించారు. మోడీకి సంతానం లేరని, అందుకే జగన్ దత్తపుత్రుడు అని విమర్శించారు. మోడీ, అమిత్షా బ్లాక్మెయిల్ వల్లే జగన్ కేంద్రం చెప్పినట్లు వింటారని సీపీఐ నేత నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు.