సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ అస్తవ్యస్థ పాలన, ఏకపక్ష నిర్ణయాలు వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వస్తోంది. కొత్త పెట్టుబడుల సంగతి దేవుడెరుగు….ఉన్న సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో రూ.70 వేల కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అదానీ గ్రూప్…జగన్ హయాంలో ఆ ప్రాజెక్టును హైదరాబాద్‌కు తరలించింది. రూ. 15 వేల కోట్ల విలువైన రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా ఏపీ నుంచి తరలివెళ్తోంది. అయితే, గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్టు…ఏపీకి రూపాయి పెట్టుబడులు తీసుకురాని జగన్…హెలికాప్టర్లలో తిరగడానికి మాత్రం ఈ రెండున్నరేళ్లలో దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నా అంటూ గొప్పలు చెప్పే జగన్…ఎయిర్ అలవెన్స్‌ల కింద కోట్లు ఖర్చుపెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. తన ఐదేళ్ల హయాంలో పర్యటనల కోసం చంద్రబాబు రూ.32 కోట్లు ఖర్చు పెట్టి రూ.1.39 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని.. కానీ జగన్ 3 ఏళ్లు తిరగకుండానే దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ ‘గాలి’ తిరుగుళ్లకు (సాధారణ విమాన ప్రయాణాలు కాకుండా) పెట్టిన ఖర్చంత పెట్టుబడులు రాలేదని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అయినా సరే జగన్ గాలి తిరుగుళ్ల మానలేదని తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేసేలా జగన్ తాజాగా ప్రవర్తించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న దావోస్ కు వెళ్లేందుకు జగన్ ఏర్పాటు చేసుకున్న స్పెషల్ ఫ్లయిట్ ఖర్చుపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. ”జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయజ్ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు, గంటకు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్ లో దిగారని తెలుస్తోంది.
లండన్ కు దాదాపుగా 13-14 గంటల సమయం. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు. ఇక లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరు. లావిష్ ఫ్లైట్ లో, రాయల్ గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి. మన పొట్టలు కొట్టి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక జగన్ రెడ్డి, సీబీఐ కోర్ట్ లో, తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి? చిదంబర రహస్యం ఏంటో ? మీ ఎంపీ గారు చెప్పింది, నిజమేనా అయితే?” అని అయ్యన్న పాత్రుడు ట్విట్టర్లో ప్రశ్నించారు.