టాలీవుడ్ హీరోలలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో మెగా ముద్రతో స్టైలిష్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన బన్నీ…ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐకాన్ స్టార్‌గా మారాడు. ఇక, తాజాగా పుష్ప మూవీతో పాన్ ఇండియా రేజ్ లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న అల్లువారబ్బాయికి అంతకుముందు నుంచే కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నిత్యం సినిమాలు, షూటింగులతో బిజీబిజీగా గడిపే బన్నీ…సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉండేందుకు ప్రాధాన్యతనిస్తుంటాడు. ఈ క్రమంలోనే మా అల్లుడు బంగారం అంటూ అల్లు అర్జున్ గురించి ఆయన మామ చంద్రశేఖర్ (స్నేహరెడ్డి తండ్రి) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అల్లుడిని ఆకాశానికెత్తేసిన చంద్రశేఖర్…అల్లుడికి వందకు వంద మార్కులు వేస్తానని చెప్పారు. తమకు అల్లు కుటుంబంతో రిలేషన్ ఏర్పడక ముందు నుంచి చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, తాను ఆయన అభిమానినని చెప్పుకొచ్చారు.
ఏదైనా ఫంక్షన్ జరిగితే తనకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి అడుగుజాడల్లో నడవడంతోనే.. మెగా హీరోలు అందరూ అంత ఎత్తుకు ఎదిగారని అన్నారు. ఇక, తన అల్లుడు అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు వేరే రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారని, బన్నీ సినిమాల్లోని పాటలను జమ్మూ కశ్మీర్లో కూడా వింటున్నారని కితాబిచ్చారు. ఇది అల్లుఅర్జున్ హార్డ్ వర్క్‌తోనే సాధ్యమైందన్నారు.
ఇక, తన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్ కాళ్లుకడిగి కన్యాదానం చేశానని, పెళ్లి సమయంలో అల్లు అర్జున్ రూపాయి కట్నం కూడా తీసుకోలేదని అన్నారు. అల్లు ఫ్యామిలీ కట్నానికి వ్యతిరేకమని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనకే చాలా ఉంది. మనం ఇచ్చేది ఆయనకు పెద్ద లెక్క కూడా కాదని తాను అనుకుంటున్నానని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.