అంబేద్కర్ పేరును అందాల కోనసీమ ప్రాంతానికి పెట్టినందుకు కృతజ్ఞతగా బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వరిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణు నిన్నటి వేళ తాడేపల్లి ప్యాలెస్ లో యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సన్మానించారు. కేవలం పేరు పెట్టినంతనే ఆయన సన్మానిస్తే, మరి ! అంబేద్కర్ కలలను నిజం చేయాలన్న ప్రయత్నంలో ఉన్న వారంతా ఇలాంటి సన్మానాలు చూసి ఏమయిపోవాలి.
అయినా ఎన్టీఆర్ పేరు, వైఎస్సార్ పేరు, అంబేద్కర్ పేరు ఇవి రాజకీయాలకు అతీతంగా వినపడవు ఎందుకని ? అంటే వాళ్లంతా ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అయి ఉంటున్నారా లేదా వారిని ఆ విధంగా పరిమితం చేయాలని పరితపిస్తున్నారా ? ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లను పోనీ ఉద్దేశపూర్వకంగానే వాడుకుంటున్నారని నిర్థారిద్దాం కానీ అంబేద్కర్ పేరు కూడా అదే కోవలో చేర్చేశారా అన్నది ఓ డౌట్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తావిస్తోంది.
వాస్తవానికి దళిత వాడల అభివృద్ధి ఇవాళ లేనేలేదు. వాళ్లకు ఇస్తామన్న ఉచిత విద్యుత్ (200 యూనిట్ల వరకూ) ను కూడా నిలిపివేయాలని ఆలోచిస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. ఈ తరుణాన కేవలం అందాల కోనసీమకు జగన్ చేసిన సాయం ఏంటన్నది ఒక్కసారి ఆలోచించాలి.. ఆరా తీయాలి. రాజకీయాలకు అతీతంగా ఎవరేంటన్నది తెలుసుకోవాలి. గుర్తించగలగాలి.
కులాలు వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా విభజన అయిపోయిన మనుషులకు గొప్ప వ్యక్తుల స్ఫూర్తి ఎందుకనో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టిపోతున్నాయి. కొన్నింట అస్సలు విడుదలే కావడం లేదు.దళితుల హక్కుల అన్నవి కృష్ణార్పణం అయిపోతున్నాయి. అంటే ఇవి నీటి మీద రాతల్లానే మిగిలిపోతున్నాయి. మరి! సాధించిందేంటి ? సాధించాల్సింది ఏంటి ? ఇవి కదా ప్రశ్నించుకోవాలి.
చాలా అంటే చాలా ఆలోచిస్తే లేదా ఆరాతీస్తే పదవుల్లో న్యాయం చేశాం అంటారే ! వాటికి ఏమయినా అధికారాలు ఉన్నాయా ? పవర్ ఉన్న పదవులు రెడ్లకు ఇచ్చకున్నారు. దళితులకు, బీసీలకు నామ్ కే వాస్తే పదవులే ఇచ్చారు. ఇది ఎందుకని పట్టించుకోరు అన్నది ప్రజా హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
బీసీలూ- ఎస్సీలూ – మైనార్టీలూ కలిసి సాధించిన హక్కులు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని సాధించాల్సినవీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడం అంటే కేవలం పదవుల బేరం దగ్గరే ఆగిపోవడమా ? లేదా పదవులే అంతిమమా లేదా ఇప్పటి మాదిరి పేర్లే అంతిమమా ? అన్నది అంతా ఒక్కసారి పునరాలోచన చేయాలి అన్నది ప్రజా సంఘాల వాదన.