అదృష్టం అంటే లాయర్ నిరంజన్ రెడ్డిది. అదృష్టం అంటే మెగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిది. అదృష్టం అంటే నిర్మల్ ప్రాంతానికి చెందిన చిన్నోడిది. ఇంకా చెప్పాలంటే అదృష్టం అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిది కూడా ! రాష్ట్రం విడిపోయాక తెలంగాణ కోటాలో పదవులు పొందిన ఆంధ్రులు లేరు. తెలంగాణ వాకిట నేరుగా పోటీచేసి నిలిచి గెలిచిన ఆంధ్రులు కూడా లేరు. అయితే ఇప్పటి తెలంగాణ నాయకులంతా ఆంధ్రా పార్టీల నుంచి ఎదిగిన వారే అన్న సంతృప్తి అయితే మాత్రం అటు తెలుగుదేశంలోనూ ఇంకా వైసీపీలోనూ ఉంటే ఉండవచ్చుగాక !
ఈ తరుణంలో నిర్మల్ ప్రాంతానికి చెందిన యువ లాయర్, ఆచార్య సినిమా నిర్మాత (గతంలో ఘాజీ లాంటి సినిమా కూడా తీశారు) నిరంజన్ రెడ్డి అనూహ్యంగా కాకపోయినా చాలా రోజుల తర్జనభర్జనల తరువాత పెద్దల సభకు పోయే వరం పొందారు. ఆ విధంగా ఈ కుర్రాడు అదృష్టవంతుడు. ఓ విధంగా జగన్ కు ఎంతగానో కలిసి వచ్చిన లాయర్ కూడా ! ఆయన కేసులను వాటి తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సుప్రీంలో తన వాదనలు వినిపించిన కుర్ర లాయర్. అందుకు కృతజ్ఞతగానే ఈ పదవి అని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం ఇదంతా అదృష్టమే తప్ప మరొకటి కాదు అని కూడా తేల్చేస్తున్నారు.
లాయల్టీ మేక్స్ మెనీ మోర్ థింగ్స్.. డబ్బు మాత్రమే కాదు విధేయత కూడా ఎన్నో పనులకు కారణం అవుతుంది. అలాంటి విధేయత మరియు విషయ జ్ఞానం ఉన్నవారు చాలా మందే వైసీపీకి చెందిన వారిలో ఉన్నా కూడా వారికి ఆవగింజంత అదృష్టం లేదు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. ఏపీ నుంచి రాజ్యసభకు సినీ నటుడు ఆలీని నామినేట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. చివరి నిమిషంలో ఆలీని కాకుండా .. అటు రాజకీయ, సినీ రంగానికి చెందిన జగన్ సొంత సామాజిక వర్గం నేత నిరంజన్ రెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారు.