అనంతపురం టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరి పార్టీని ఇరకాటంలో పడేస్తున్న సంగతి తెలిసిందే. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వర్గపోరు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ మరో కీలక నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది.
కొద్ది రోజుల క్రితం తన అనుమతి లేకుండా పుట్టపర్తిలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి రావడంపై పల్లె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి జేసీని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. జేసీ వర్సెస్ పల్లె మధ్య రాజుకున్న రాజకీయ వైరం తాజా కామెంట్లతో మరో మలుపు తిరిగింది.
పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ లేకుండా చేస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ స్థానిక నేతలు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే, పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో తమ శిబిరం మౌనంగా ఉన్నట్లు పల్లె వర్గీయులు అన్నారు. అయితే, గత వారం పుట్టపర్తిలో జేసీ అడ్డగింత తర్వాత పల్లె వర్గీయులు కూడా విమర్శలు మొదలుబెట్టారు.
పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా కొత్త ముఖం రాబోతుందని, పల్లె రఘునాథ్ రెడ్డికి చుక్కెదురవుతుందని జేసీ చేసిన వ్యాఖ్యలు పల్లె శిబిరంలో ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో, మీడియా ముందుకు వచ్చిన పల్లె రఘునాథరెడ్డి…తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాబోదని జోస్యం చెప్పారు. స్వతహాగా యాభై మీటర్లు కూడా నడవలేని ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాదని సెటైర్లు వేశారు. పల్లె రఘునాథ్ రెడ్డిని ఇప్పటి వరకు ఒకవైపే చూశావు త్వరలోనే రెండో వైపును చూస్తావంటూ బాలయ్య డైలాగులతో జేసీకి కౌంటరిచ్చారు పల్లె.
తన మీద మాటల దాడికి దిగితే తాను కూడా విమర్శలకు దిగాల్సి వస్తుందంటూ జేసీకి దీటుగా జవాబిచ్చారు పల్లె. ఈ విషయంలో తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగుతో పంచ్ లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే పార్టీలో నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగడంపై టీడీపీ అధిష్టానం కూడా గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఇలా వర్గపోరు ఉండడం వల్ల వైసీపీ లాభపడుతోందని, త్వరలోనే ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు క్లాస్ పీకే అవకాశముందని తెలుస్తోంది.