నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఇటు సినీ రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ మంచి పేరున్న సంగతి తెలిసిందే. అయితే, అభిమానులపై గతంలో బాలయ్య పలు సందర్భాల్లో చేయి చేసుకున్న ఘటనలు వివాదాస్పదమయ్యాయి. గతంలో నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన అభిమానిపై బాలయ్య చేయి చేసుకున్న ఘటన రాజకీయ దుమారం రేపింది.
ఇక, ఆ తర్వాత కే ఎస్ రవికుమార్ చిత్రం షూటింగ్ సందర్భంగా తన అసిస్టెంట్ పై చెయ్యి చేసుకున్న వీడియో బాలయ్యను ఇరకాటంలో పడేసింది. బాలయ్య చేతివాటంపై జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత గడపగడపకు టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఇంకో కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ర్యాలీ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ అభిమాని కమ్ కార్యకర్త బాలయ్యపై పడడంతో ఆయన అసహనానికి గురై చేయి చేసుకున్న ఘటన సంచలనం రేపింది.
దీంతో, బాలయ్యకు చేతివాటం ఎక్కువ, అభిమానులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారన్న టాక్ మీడియాలో ఉంది. అయితే, బాలయ్యను అతి దగ్గరగా చూసిన వారు, ఆయనతో కొంత సమయం గడిపిన వారు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య గురించి సీనియర్ జర్నలిస్టు భరద్వాజ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. బాలయ్య మనస్తత్వం గురించి చాలామందికి తెలియని నిజాలు భరద్వాజ వెల్లడించారు.
స్టార్ హీరో అనే గర్వం..ఆ భావనే బాలయ్యకు ఉండదని భరద్వాజ చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ తరహాలో బాలయ్య కూడా అంతే సింపుల్ గా ఉంటారని భరద్వాజ చెప్పారు. పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఆడియెన్స్ లో నుంచి స్టేజ్ మీదకు వెళ్లడం అనే కల్చర్ ఎన్టీఆర్ మొదలుబెట్టారని, దానిని బాలయ్య కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ప్రతి రోజు ఉదయం అరగంట పాటు ఫ్యాన్స్, పబ్లిక్‌తో మాట్లాడేవారని, బాలయ్య కూడా ఇదే అలవాటు చేసుకున్నారని చెప్పారు.
నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే బాలయ్య తన రెమ్యునరేషన్ తగ్గిస్తారని, తక్కువ రెమ్యునరేషన్ కు సినిమాలు చేసేవారని వెల్లడించారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బాలయ్య నెంబర్ వన్ అని కితాబిచ్చారు. బాలయ్య డైరెక్టర్స్ హీరో అని, ఓ సారి కథకు ఓకే చెప్పాక డైరెక్టర్ చెప్పింది చేస్తారని అన్నారు.ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ కూడా ఇతరుల సినిమాల్లో వేలు పెట్టేవారు కాదన్నారు. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొట్టే సీన్ కూడా దర్శకుడు పట్టుబట్టడంతోనే అయిష్టంగా బాలయ్య చేయాల్సి వచ్చిందన్నారు.
బాలయ్యకు బయట ఒకటి.. లోపల ఒకటి ఉండదని.. ఆయన రూమ్‌లో ఏం మాట్లాడతాడో ? ఫోన్లో కూడా అదే మాట్లాడతారని భరద్వాజ అన్నారు. బాలయ్యది మంచి మనస్తత్వం అని భరద్వాజ ఆకాశానికి ఎత్తేశారు.