అరచేతికి అధికారం రావాలంటే అంత ఈజీ కాదు. అందుకోసం చాలా ఎత్తులు.. పైఎత్తులు వేయాలి. ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలి. వారికి నమ్మకం కలిగించాలి. ఏదో అద్భుతం జరుగుతుందన్న భావన కలిగేలా చేయాలి. వీటన్నింటికి మించి తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీల కంటే తామే మిన్న అన్న నమ్మకాన్ని.. భరోసా కలిగేలా చేయాలి. వీటిల్లో ఏం లేకున్నా ఫలితం సరిగా వచ్చే అవకాశం ఉండదు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తమకున్న అవకాశాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా తమ రాష్ట్ర పార్టీ అధినేతకు ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు వీలుగా పాదయాత్రను చేయిస్తున్న కమలనాథులు.. విడతల వారీగా చేయిస్తున్నారు. ఏకబిగిన పాదయాత్ర చేయటం ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉందే తప్పించి.. విడతల వారీగా పాదయాత్ర చేయటం ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదన్న పెదవి విరుపు ఉంది. మొదటి దఫా పాదయాత్ర ముగింపు సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా ముగిసిన రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో బండి ప్రసంగానికి మధ్య తేడా ఉందనే చెప్పాలి.
గతంలో ఎప్పుడూ లేనంత ఆవేశంగా కేసీఆర్ సర్కారు మీద విరుచుకుపడిన బండి.. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ బతిమిలాడుకున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మాటలో అంత స్పష్టత లేనట్లుగా ఉండే బండి.. ఒక్క ఛాన్స్ అన్న మాటను తనకు వచ్చిన తీరులో చెప్పిన వైనానికి సంబంధించిన వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు. ‘‘వొక్కసారి గెలిపించండి ప్లీస్’’ అంటూ ఆయన మాటల్ని ఎటకారం ఆడేస్తున్నారు. బండి అడిగిన తీరు ప్రజల మనసుల్ని దోచుకునే కన్నా కూడా.. అయ్యా.. అమ్మా.. ప్లీజ్ అన్న తీరులో ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిలో ఉండాల్సిన కమాండ్ బండి మాటల్లో లేదని.. ప్రజల జీవితాల్ని బాగు చేస్తానన్న వివ్వాసాన్ని కలిగింది.. ఒక్క ఛాన్సు ఇవ్వాలన్న అర్థించేలా ఉండటం ఓకే కానీ.. మరీ దిగజారిపోయి అడుక్కున్న తరహాలో బండి అడిగారని.. ఈ తీరు ప్రజల్ని ఆకట్టుకునే అవకాశం ఉండదంటున్నారు.
ఇలాంటి విషయాల్లో బండి మరింత ఎక్స్ ర్ సైజ్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ అంటూ అదే పనిగా ప్రజల్ని అడిగి అధికారంలోకి వచ్చిన వారికి భిన్నంగా బండి అడిగిన విధానం ఉందంటున్నారు. మరి.. దీనికి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేస్తే సరిపోతుంది.