సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కేటీఆర్ ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపింది. మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్ పొలిటికల్ హీట్ పెంచింది.
అంతకుముందే, కేసీఆర్ పై, తనపై నోరు పారేసుకుంటే లీగల్ చర్యలు తప్పవని కేటీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బండి సంజయ్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే, కేటీఆర్ వార్నింగ్ కు బండి సంజయ్ స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా బండి సంజయ్ కు కేటీఆర్ షాకిచ్చారు. బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో కేటీఆర్ కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ తరఫు లాయర్ పేర్కొన్నారు.
అలా కాని పక్షంలో బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులపై బండి సంజయ్ ఇంకా స్పందించ లేదు. మరోవైపు, బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ శనివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో బీజేపీ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ ముగింపు సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు
ఇప్పటికే ఈ యాత్ర తొలిదశను బండి సంజయ్ మహబూబ్ నగర్లో ముగించారు. ఆ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన సంగతి తెలిసిందే. అయితే, రేపు సభ నిర్వహిస్తున్న తరుణంలో, అమిత్ షా ఆ సభకు హాజరవుతున్న నేపథ్యంలో బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.