సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసే దమ్ముందా అని జగన్ కు సవాల్ విసిరిన గోరంట్ల… ‘‘జగన్! టీడీపీ వెంట్రుక కూడా పీకలేవు’’అంటూ తాజాగా ఛాలెంజ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, జగన్ ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.
ఆ కారణంతోనే జగన్ ఫ్రస్టేషన్కులోనై టీడీపీ నేతలపై కేసులు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. అందరినీ గమనిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక ఎవరీనీ వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. జైళ్లు సిద్ధంగా ఉంటాయి…. జాగ్రత్త అని జగన్ ను గోరంట్ల హెచ్చరించారు. గడపడగపకూ ప్రభుత్వం కార్యక్రమం కోసం వెళతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు.
వైసీపీ కార్యకర్తలు కూడా గడపగడపకు వెళ్లాలంటే భయపడిపోతున్నారని చెప్పారు. టీడీపీ బలపడిందని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఒంటరిగా కూడా గెలవగల సత్తా టీడీపీకి ఉందని, ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున పొత్తుల జోలికి ఇప్పుడే వెళ్లేదిలేదని గోరంట్ల స్పష్టం చేశారు. కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాశవిక పాలన కొనసాగుతోందని అన్నారు.
ఈ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు, నారాయణలపై కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని, చంద్రబాబును అరెస్ట్ చేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గోరంట్ల హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, అమెరికాలో ఎన్నారైలు ఈనెల 28న నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవానికి ముఖ్యఅతిథిగా గోరంట్ల వెళుతున్న విషయం తెలిసిందే.