తెలుగు వారు ఎక్కడ ఉన్నా,ఇక్కడి నేల పట్ల, ఇక్కడి ప్రజల బాగోగుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తార నే విషయం తెలిసిందే. ఏదేశమేగినా, ఎందు కాలిడినా, తెలుగు రాష్ట్రాలు సమున్నతంగా విరాజిల్లాలని కోరుకుంటారు.మరీ ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రవాసాంధ్రులు,ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. ఇక, ఇటీవల అమరావతి రాజధాని విషయంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమించారు.ఇప్పటికే నష్టపోయిన ఏపీకి, అమరావతి కూడా లేకుండా పోతే, అసలు అడ్రస్ గల్లంతవుతుందని భావించారు.
ఈ నేపథ్యంలోనే ప్రవాసాంధ్రులు, ప్రత్యక్షంగా పరోక్షంగా, అమరావతిని నిలబెట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.ఇప్పటికీ, అమరావతి ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అనిర్వచనీయం. ఇక, ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలోనూ కదం తొక్కేందుకుఎన్నారైలు సిద్ధంగా ఉన్నారు.ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కు కర్మాగారాన్నికేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నారైలు రెడీ అవుతున్నారు. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎన్నారైలు, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.
దీనిలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు ‘జయరామ్ కోమటి ‘నేతృత్వంలో, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెమొరాండం సమర్పించనున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లోనూ వీటిని అందించి, విశాఖ ఉక్కుపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదనే డిమాండ్‌ను గట్టిగా వినిపించనున్నారు.అదేసమయంలో విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.అమరావతి కోసం ఉద్యమించిన తరహాలో, ‘జయరామ్ కోమటి ‘దిశా నిర్దేశంలో ఈ విశాఖ ఉక్కు ఉద్యమం సాగనుంది.