మరికొద్ది గంటల్లో ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలు కాబోతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ బలపరిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఓటర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నందిగామలో టీడీపీ సర్పంచి అభ్యర్థి వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక, ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి వైసీపీ అభ్యర్థుల ఇళ్లకు నేరుగా మద్యం తరలిందని, అయినా పోలీసులు, ఎక్సైజ్ శాఖాధికారులు మిన్నకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నోట్ల కట్టల పాములతో గ్రామాల్లో వైసీపీ నేతలు కలియ తిరుగుతున్నారు. మరోవైపు, మద్యాన్ని ఏరులుగా పారిస్తూ మందుబాబులను ఆకట్టుకుంటున్నారు. తెనాలి మండలం తేలప్రోలులో ఓటర్ స్లిప్పులుపై ప్రభుత్వ పథకాలను రాసి వాలంటీర్లు పంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థికి ఓటు వేయకుంటే పథకాలకు ఇబ్బంది అవుతుందని హెచ్చరిస్తున్నారట.
వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కోడ్ ఉల్లంఘించినా… అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మహిళలకు గిఫ్టులు, చీరెలు, జాకెట్లు, వెండి గ్లాసులు, మందుబాబులకు మద్యం బాటిళ్లు పంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కోడ్ ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు ఇటు అధికారులు, అటు పోలీసులు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు.
మరోవైపు, ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రేపటి పోలింగ్ కోసం 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 3 వేల 458 సెన్సిటివ్, మూడు వేల 594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. 519 జోనల్ అధికారులు, 1121 మంది రూట్ అధికారులు, మూడు వేల 46 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ పర్యవేక్షిస్తారని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేకంగా నోటా కూడా ఉంటుందని తెలిపారు.