సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బ్యాంకుల్లో మొండి బకాయిలు ఎగ్గొట్టే బడాబాబుల భరతం పట్టే హీరో నేపథ్యంలో పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా అమెరికాలోనూ భారీ స్థాయిలో రిలీజైంది. ట్రైలర్ లో చూపించినట్లుగానే మహేష్, కీర్తి సురేష్ ల మధ్య లవ్ ట్రాక్, కామెడీ అదిరిపోయింది. దీంతో, అమెరికాలోనూ మహేష్ అభిమానులకు సర్కారు వారి పాట రూపంలో అసలు సిసలు పండుగ వచ్చేసింది.
దాదాపు రెండున్నర ఏళ్ల తరువాత తెరపై మహేష్ బాబు సినిమా రావడంతో అమెరికాలోని బే ఏరియాలో ఫ్యాన్స్ రచ్చ చేశారు. బే ఏరియా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు, బావార్చి రెస్టౌరంట్స్ అధినేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో మహేష్ అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ సతీష్ బొల్లా. నాగార్జున కోవి, అజయ్ యార్లగడ్డ, సయ్యద్ ఫౌజన్, అజయ్, కౌషిక్, సుబ్బారావు తలచిరు, అమర్ అనుగంటి, వెంకట్ సాదినేని, రాజా శేఖర్ కొండా, అనిల్ యడ్లపల్లి, ప్రకాష్, సందీప్ ఇంటూరి, గోకులన్, శివ తదితరులు థియేటర్ల దగ్గర హంగామా చేశారు. ఎల్లుండి వీకెండ్, ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకపోవడంతో మరో 3 రోజుల పాటు బే ఏరియాలో మహేష్ బాబు ఫివర్ వైరల్ కావడం ఖాయం.
అమెరికాలోనూ మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు కూడా యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం యుఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్ $650K మార్కును క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. యూఏస్ లో చాలా థియేటర్లలో ‘డాక్టర్ స్ట్రేంజ్’ సినిమా ప్రదర్శిస్తున్నందున ‘సర్కారు వారి పాట’ కు చాలా వరకు బిగ్ స్క్రీన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ 448 లొకేషన్స్ లో 650K డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ రాబట్టగలిగిందంటే అమెరికాలో మహేష్ మేనియా ఏంటో అర్థమవుతోంది.