ప్రస్తుతం ఏపీలో రాబోయే ఎన్నికల గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి దీటుగా టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు
ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్ల రామయ్య…షాకింగ్ కామెంట్లు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీని కొట్టడం అంత ఈజీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.151 సీట్లు గెలిచిన జగన్ను ఓడించాలంటే అందరూ కలవాల్సిందేనని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టీడీపీతో పలు పార్టీల పొత్తుల గురించీ వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేనతో పాటు అన్ని పార్టీలు కలిసి జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాయని జోస్యం చెప్పారు.
వైసీపీ ఓటమికి అన్ని పార్టీలు కలిసి రావాలన్న దిశగానే చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు విషయం తేల్చాల్సింది సోము వీర్రాజు కాదని ఆయన అన్నారు. అంతకుముందు, పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ జగన్ ఎగిరెగిరి పడుతున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గతంలో వైసీపీ-టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదా? వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేయలేదా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. సమయం వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడతానని అన్నారు. వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక తడాఖా చూపెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల సాయం లేకుండా జగన్ బయటకు రాలేరని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ ఓటమికి అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని చంద్రబాబు చేసిన కామెంట్లనే వైసీపీ నేతలు వక్రీకరించారు.