సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు…భూమి ఎవరిదైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కన్ను పడిందంటే చాలు కబ్జా కావాల్సిందేనని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వైసీపీ నేతలు బోర్డు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం….భూమి ఏదైనా సరే కబ్జా మాత్రం కామన్.
ఎకరాల కొద్దీ పొలాలు, వందల సెంట్ల కమర్షియల్ ప్లాట్లు స్వాధీనం చేసుకుని భూ బకాసురులుగా మారుతున్నారు. ఇదేం అన్యాయం అని ఎవరైనా ఎదురు తిగిగితే…ఇచ్చిన పదో పరకో తీసుకొని స్థలం రాసిచ్చి ఖాళీచేయాలంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మాట వినని వారిపై రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ రెండూ కుదరకపోతే రెెవెన్యూ శాఖలో లొసుగులు, అధికారం ఉపయోగించి కొత్త రికార్డులను సృష్టించి అసలు స్థలం ఓనర్లను కోర్టులపాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ విమర్శలకు తగ్గట్లుగానే కొద్ది రోజుల క్రితం ఏకంగా విశాఖ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కబ్జా చేసిన వైనం సంచలనం రేపింది. ఎంవీవీకి చెందిన ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ వేస్తున్న వెంచర్ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే, దానికి పక్కనే ఉన్న ఎస్పీ మధుకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పై కూడా భూ కబ్జా ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. తన భూమిని సురేశ్ ఆక్రమించారంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రకాశం జిల్లా దరిమడుగు గ్రామానికి చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ ఫిర్యాదు చేశారు. సురేశ్ నుంచి తన పొలాన్ని విడిపించాలని ఎంతమందికి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను వేడుకున్నారు.