రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పొడవబోతోందంటూ వైసీపీ ‘అధికార’ కర్త, కర్మ, క్రియ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే చెప్పిన ట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, జగన్, పీకేల మధ్య అండర్ స్టాండింగ్ కుదరకపోవడమో, మరే ఇతర కారణమో, లేక ఇప్పుడే పొత్తులపై లీకులివ్వడం ఎందుకనో..కారణమేదైనా గానీ…వైసీపీ నేతలు మాత్రం పొత్తు వ్యవహారాన్ని ఖండోపఖండాలుగా ఖండిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో మేము సోలోగానే వస్తామంటూ….సింహం సింగిల్ గా వస్తుంది అనే రేంజ్ లో రజనీకాంత్ మార్క్ డైలాగులు కొడుతున్నారు. అదేదో సినిమాలో పెళ్లి కొడుకు మాత్రం వీడే…కానీ, వాడేసుకున్న చొక్కా మాత్రం నాది అన్న రేంజ్ లో…వచ్చే ఎన్నికల్లో వైసీపీది ఒంటరి పోరేనంటూ ఆ పార్టీ నేతలు జనం, మీడియా చెవిలో జోరీగల్లా పోరు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మాది సోలో ఫైట్ అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో ఆ ప్రకటనకు టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇస్తూ వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా సెటైర్లు వేశారు. సోలో ఫైట్ అంటూ సోది కబుర్లు ఎందుకు సాయిరెడ్డి గారు…అంటూ బుద్ధా వెంకన్న చురకలంటించారు. జగన్ రెడ్డి సోలో ఫైట్ మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులు, సొంత చెల్లి, తల్లి ఛీ కొట్టిన జగన్ సోలోగా మిగిలిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో వైసీపీ పొత్తుపై పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటన తర్వాత కూడా సోలో ఫైట్ ఏంటని పంచ్ లు వేశారు.
జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లాస్ట్ అని, మళ్లీ ఓటేసేదేలే అని జనాలు తొడకొట్టి మరీ శపథం చేస్తున్నారంటూ బుద్ధా చమత్కరించారు. రేపులు, మర్డర్లు వైసీపీ నాయకుల జన్మహక్కు కాబట్టే చర్యలు లేవని బుద్ధా షాకింగ్ కామెంట్లు చేశారు. నిజంగా టీడీపీ వాళ్లు ఆ రేపుల వెనుక ఉంటే నడి రోడ్డు మీద ఉరి తీసి హడావిడి చేసేవాళ్లు కదా? అంటూ సాయిరెడ్డికి షాకిచ్చారు వెంకన్న. విశాఖలో మీ బంధువుల భూకబ్జాలు తప్ప ఒక్క ఇటుకైనా పెట్టారా? అని సాయిరెడ్డిని నిలదీశారు. సాయిరెడ్డి అడుగుపెట్టాక విశాఖపట్నం విషాదపట్నంగా మారిందని, అందుకే అక్కడి నుండి తరిమేశారని పంచ్ లు వేశారు.