తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను టీపీసీసీ రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకొని నడుపుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ టూర్ కోసం కసరత్తు చేసిన రేవంత్…అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. రాహుల్ వెన్నంటే ఉండి…షెడ్యూల్ ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చింది. చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు రాహుల్ తో పాటు భట్టి విక్రమార్కను పంపి రేవంత్ కు మొండిచెయ్యి చూపడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో, అందుకు నిరసనగా ఎన్ఎస్యూఐ నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే 18 మంది ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ అనుమతి వ్యవహారంలో హై డ్రామా నడిచింది. తొలుత రాహుల్ కు జైళ్ల శాఖ అధికారులు అనుమతినివ్వలేదు.
టీపీసీసీ తరఫున చంచల్‌గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు రాహుల్‌కు అనుమతివ్వాలంటూ రేవంత్ లేఖ రాశారు. కానీ, ఆ లేఖపై జైళ్ల శాఖ సానుకూలంగా స్పందించలేదు. దీంతో, ఏఐసీసీ నుంచి తెలంగాణ జైళ్ల శాఖకు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంతకంతో మరో లేఖ వచ్చింది. ఆ లేఖ వచ్చిన తర్వాత జైళ్ల శాఖ రాహుల్ జైలు సందర్శనకు అనుమతించింది.
అయితే ఆ లేఖలో మాణిక్కం ఠాగూర్.. జైలు లోపలికి రాహుల్‌తో పాటు భట్టి విక్రమార్కను మాత్రమే అనుమతించాలని కోరారని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరును అసలు ప్రస్తావించలేదట. అందుకే, రాహుల్ వెంట చంచల్ గూడ జైల్లోకి భట్టిని మాత్రమే అనుమతించి రేవంత్ ను అనుమతించలేదు. దీంతో, రేవంత్ ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై చర్చ మొదలైంది. రేవంత్ పై అధిష్టానం గుర్రుగా ఉందా అన్న టాక్ వస్తోంది.