కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో సేవ చేయాలని తీర్పు చెప్పింది.
అయినా సరే కొందరు ఐఏఎస్ ల తీరు మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. తమ తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్షలు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది.
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ మాజీ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ లకు కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్ష పడింది. అయితే, నిన్న జరిగిన విచారణకు అరుణ్ కుమార్, వీరపాండియన్ హాజరై తీర్పు అమలును 6 వారాలపాటు నిలిపివేయాలని అభ్యర్థించారు. దీంతో, తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.
కానీ, పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలిపివేసేందుకు జస్టిస్ బట్టు దేవానంద్ నిరాకరించారు. ఈ నెల 13వ తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) ఎదుట పూనం మాలకొండయ్య లొంగిపోవాలని ఆదేశించారు. అయితే, సింగిల్ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య నిన్ననే అత్యవసరంగా ధర్మాసనం ఎదుట అప్పీల్ చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.
కాగా, కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్. మదనసుందర్ గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, అతడిని పరిగణలోకి తీసుకొని రెండు వారాల్లో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలంటూ 22 అక్టోబరు 2019న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ మదన సుందర్ గౌడ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.