విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మకానికి పెట్టడంతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు నిరసన తెలుపుతుండగా…జగన్ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. జగన్ ప్రోద్బలంతోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరిస్తున్నారని, అందుకే ఈ విషయంపై జగన్ , వైసీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు గంటా పంపారు. తన స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసిన గంటా…స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, అందుకు అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో గంటా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గంటా అన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలతో దానిని సాధించామని, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవనే కుంటి సాకుతో100 శాతం ప్రైవేటుపరం చేయడం దారుణమని గంటా నిప్పులు చెరిగారు. ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ధారాదత్తం చేస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కూడా గనులు కేటాయించి నష్టాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై, సీఎం జగన్ తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని గంటా డిమాండ్ చేశారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాలు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆ నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.