గత కొంతకాలంగా పార్టీలో జోరుగా తెరమీదకు వస్తున్న అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పెద్ద ప్లానే వేశారా? ఇటీవల పార్టీ ప్లీనరీ నిర్వహించిన సమయంలో గమనించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటుగా జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా గులాబీ దళపతి అంతర్గత అసంతృప్తులకు చెక్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వివిధ జిల్లాల్లోని పార్టీ నేతల మధ్య ఉన్న అసఖ్యతకు, అసంతృప్తులను తొలగించడంతో పాటుగా పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా `పెద్ద` స్కెచ్ వేసినట్లు చెప్తున్నారు. ఇదంతా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన రాజ్యసభ ఎన్నికల గురించి.
టీఆర్ఎస్ సీనియర్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంఖ్యా బలం ప్రకారం ఈ సీటు టీఆర్ఎస్ కే దక్కనుంది. దీంతో సహజంగానే ఆశావహుల గురించి చర్చ జరుగుతోంది. తమకు ఈ దఫా అవకాశం వస్తుందా? అని గులాబీ పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. మరికొందరు తమకు చాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే, పెద్దల సభలో సీట్ల ఆధారంగా సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టే యోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గోడం నగేశ్, మంద జగన్నాథం, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో గులాబీ దళపతి కేసీఆర్ అంతటి సీనియార్టీ కలిగి ఉన్న ఈ నేతలు టీఆర్ఎస్లో వివిధ పదవులు అలంకరించి అనంతరం మాజీలు అయ్యారు. ఇప్పుడు వారికి ఏం పదవులు లేక ఖాళీగా ఉన్నందున అసంతృప్తి వ్యక్తమవుతోందని అందుకే వారికి రాజ్యసభ చాన్స్ ఇస్తారని అంటున్నారు. తద్వారా పార్టీ వారి సేవలను సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది, అసంతృప్తికి చెక్ పెట్టినట్లుగా కూడా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ ముఖ్యనేతల సమాచారం.