తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం ఇటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ అందుకున్న సంగతి తెలిసిందే. అణగారిన వర్గాలను న్యాయం అందించే లాయర్ చంద్రు పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. రిటైర్డ్ జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా వాస్తవ ఘటనలతో రూపొందించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ గా నిలిచింది. అయితే, సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక నిర్మించిన ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
జై భీమ్ చిత్రంలో వన్నియార్ కులస్తులను అవమానకర రీతిలో చూపించారని రుద్ర వన్నియార్ సేన అనే కుల సంఘం తమిళనాడులోని సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం…తాజాగా హీరో సూర్యతో పాటు జ్యోతిక, ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ లపై కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించడం సంచలనం రేపింది.
ఈ చిత్రం విడుదలైనప్పుడే వన్నియార్ కుల నేతలు జై భీమ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమకు అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని, నష్టపరిహారం కింద రూ.5 కోట్లు చెల్లించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం ముదిరింది.
అంతకుముందు, ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించి సూర్యపై ట్రోలింగ్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. సినిమాలోని ఓ మార్వాడి నగల వ్యాపారి హిందీలో మాట్లాడుతుండగా పోలీసు ఉన్నతాధికారి అయిన ప్రకాష్ రాజ్ అతడి చెంప ఛెళ్లుమనిపిస్తాడు. ఈ సినిమాలోని ఆ సీన్ హిందీ భాషను అవమానించేలా ఉందని, ఆ సీన్ ను తొలగించాలని బాలీవుడ్ కు చెందిన కొందరు డిమాండ్ చేశారు.