అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ ఏ1 అయితే…విజయసాయి ఏ2 అని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్…అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని గతంలో ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా నియమించారని విమర్శలు వచ్చాయి. జగన్ అండతో రెచ్చిపోయిన సాయిరెడ్డి…విశాఖలో భూ ధందాకు తెరతీశారని టీడీపీ నేతలు పలుమార్లు దుయ్యబట్టారు.
విశాఖ వాల్తేర్ క్లబ్‌పై ఏ2..విజయసాయిరెడ్డి కన్నుపడిందని, క్లబ్‌కు ఉన్న16 ఎకరాల భూమిలో 10 ఎకరాలను ఇవ్వాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అదే కోవలో విశాఖలోని రుషికొండ హరిత రిసార్ట్స్ వద్ద పర్యాటక ప్రాజెక్ట్ పేరుతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే రుషికొండ వద్ద నిర్మాణాలు పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు అక్కడకు వెళ్లారు. అయితే, చంద్రబాబును, టీడీపీ నేతలను ఎండాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేయడంతో ఎండాడ జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబు బృందానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు కాన్వాయ్ బీచ్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉండగా, పోలీసులు ఎండాడ వైపు మళ్లించి ఎండాడ జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే రుషికొండ వైపు భారీగా తరలివెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.
ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ నిర్మాణాల సందర్శనను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వం చేపట్టింది పర్యాటక ప్రాజెక్టే అయితే అంత ఉలికిపాటు ఎందుకని జగన్ ను చంద్రబాబు నిలదీశారు. విశాఖలో గానీ, రుషికొండలో గానీ వైసీపీ పెద్దలు చేస్తున్న కబ్జాలను, ఆక్రమణలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.