రాష్ట్రంలో సర్కారు వ్యూహం మారింది. పలు విషయాలకు సంబంధించి నలువైపుల నుంచి పోటెత్తుతు న్న విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా.. ఆలయాలపై దాడుల, విగ్రహ ధ్వంసాల విషయం లో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై హిందూసమాజం నుంచి మరింత వ్యతిరేకత పెరుగుతోంది. దీనిపై ఇప్పటికే ఉద్యమబాట పట్టేందుకు మఠాధిపతులు.. పీఠాధిపతులు కూడా రెడీ అయ్యారు. తాజాగా తిరుపతికి సమీపంలోని ఓ ప్రాంతంలో భేటీ అయిన.. పీఠాధిపతులు, మఠాధిపతులు.. ఏపీలో జరుగుతు న్న విగ్రహ ధ్వంసాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వాస్తవానికి పీఠాధిపతులకు, సీఎం జగన్‌కు మధ్య అవినాభావ సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో హిందూ ధర్మంపైనా.. విగ్రహాలు, ఆలయాలపైన జరుగుతున్న దాడుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని వారు సహించలేకపోతున్నారు. ఇటీవల రామానుజ చినజీయర్ స్వామి సహా పలువురు మీడియా మీటింగులు పెట్టి మరీ.. రాష్ట్రంలో పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే చినజీయర్ స్వామి.. ఏకంగా పాదయాత్రకు సైతం రెడీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ముగిసేలోపు.. పరిస్థితి దారిలోకి రాకపోతే.. పాదయాత్ర చేస్తానని కూడా ఆయన వెల్లడించారు.
మిగిలిన పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా ఇదే వైఖరితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన జగన్ సర్కారు హుటాహుటిన చర్యలు ప్రారంభించింది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను మఠాలకు పంపుతోంది. రాష్ట్రంలో ఏమీ జరగలేదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. నిజానికి రామతీర్థం వంటి ఘటన చాలా సీరియస్ గా ఉంది. దీనిపై కేంద్రం కూడ ఆరాతీసింది. ఈ నేపథ్యంలోనే మఠాధి పతులు ఆందోళనలకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు ఇబ్బంది తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తోంది. పైకి మాత్రం గుంభనంగా వ్యవహరించినా.. లోలోన మాత్రం వైసీపీ అధినేత నుంచి ఇతర నాయకులు కూడా మథనపడుతుండడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.