మంత్రి పదవి కోసం పె..ద్ద తుండుగుడ్డ పట్టుకొని తిరిగిన అంబటి రాంబాబు.. తన చిరకాల కోరికైన మంత్రి పదవిని చేపట్టటం తెలిసిందే. ఇన్నాళ్లు తాను కోరుకున్న పదవి లేక.. జనాలకు సేవ చేసే విషయంలో వెనుకబడి పోయినట్లుగా వాపోయే ఆయనకు.. మంత్రి పదవి వచ్చిన తర్వాత తన శాఖ మీద పట్టు తెచ్చుకోవటం.. ప్రజలకు మేలు జరిగేలానిర్ణయాలు తీసుకోవటం లాంటి వాటి కంటే కూడా.. నిత్యం ఏదోలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఆయనకో బలహీనతగా మారింది.
అవసరం ఉన్నా లేకున్నా ఏదోలా పవన్ పేరును ప్రస్తావించి ఆయనపై ఘాటు విమర్శలు చేయటం ద్వారా మీడియాలో కనిపించటం.. అధినేత కోరుకున్నట్లుగా తాను ఉన్న విషయాన్ని తరచూ చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. తాజాగా నలుగురు మంత్రులకుఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని అవనిగడ్డలో ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు.. గుడివాడ అమర్ నాథ్.. మేరుగ నాగార్జున.. జోగి రమేశ్ లతో పాటు.. వైసీపీ క్రిష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో సహా సత్కరించారు. మిగిలిన వారి సంగతిని పక్కన పెడితే.. అంబటి మాత్రం ఎప్పటిలానే తన నోటికి పని చెప్పారు.
జగన్ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి కావటం కోసం పార్టీ పెట్టారో.. చంద్రబాబును సీఎంను చేయాలని పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్య విన్నంతనే.. అంబటి లాంటి వారు అంతకు మించి మరింకేం ఆలోచించగలరన్న భావన కలుగక మానదు. ఎప్పుడూ ఏదో రకంగా పవన్ ను తిట్టిపోయాలన్న రంది తప్పించి అంబటిలో మరొకటి కనిపించదు.
ఇప్పటికే ఎన్నోసార్లు తాను పార్టీ పెట్టింది.. అర్జెంట్ గా అధికారాన్నిచేతుల్లోకి తీసుకొని.. ఇష్టారాజ్యంగా పాలన సాగించేసి.. ఏపీని ఏదేదో చేద్దామన్న ఉద్దేశం లేదన్న మాటతో పాటు.. తనకు గెలుపు ఓటమి లాంటివి సమానమేనని.. గెలుపుతో పొంగిపోవటం.. ఓటమితో వొంగిపోవటం లాంటివి ఉండవన్న పవన్ లాంటి వారి మాటల్ని అర్థం చేసుకోవటానికే అంబటికి కొన్ని సంవత్సరాలు పట్టే వీలుంది. అలాంటి నేత.. పవన్ ను అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోకూడదు.