కొద్ది రోజుల క్రితం తమకు మంత్రి పదవి కట్ట బెట్టిన సంతోషంలో కొత్త మంత్రులు కొందరు సీఎం జగన్ ను ‘బాషా’తరహాలో మాఫియా డాన్ ను చేసిన సంగతి తెలిసిందే. బాషాలో రజనీకాంత్ చేతిని ఆయన అనుచరులు ముద్దాడినట్టు…జగన్ చేతిని కొందరు మంత్రలు ముద్దాడుతూ తమ వీర విధేయతను చాటుకున్న వైనం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొందరు మంత్రులైతే జగన్ కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను దేవుడిని చేయడంపైనా విమర్శలు వచ్చాయి.
అయితే, తాజాగా ఓ మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్ల తన వీర విధేయతను చాటుకున్న వైనం వైరల్ అయింది. వైవీ సుబ్బారెడ్డి కాళ్ల దగ్గర మంత్రి వేణు గోపాలకృష్ణ మోకరిల్లిన ఘటన వివాదాస్పదమైంది. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అలా మోకరిల్లడాన్ని శెట్టి బలిజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు మోకరిల్లితే తప్పు లేదని, కానీ శెట్టిబలిజ కులం పేరు చెప్పుకుని సుబ్బారెడ్డి కాళ్లమీదపడడం సిగ్గుచేటని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురంలోని శెట్టిబలిజ గ్రంథాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సమావేశం సందర్భంగా.. వైవీ కాళ్ల వద్ద మంత్రి వేణు మోకరిల్లడంపై ఆ సంఘం నాయకులు మండిపడుతున్నారు. రాగద్వేషాలకు అతీతంగా, భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన మంత్రి వేణుగోపాలకృష్ణ తన పబ్బం గడుపుకోవడానికి శెట్టిబలిజ కులాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
కాగా, వైవీ కాళ్ల వద్ద మోకరిల్లిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లకు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని చెప్పారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.