మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్లోని తన ఇంటి విద్యుత్ బిల్లును గత 15 నెలలుగా చెల్లించడం లేదా? ఈ కారణంగానే ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొందా? అసలు ఈ వార్తల్లో నిజమెంతా? నిజంగానే బొత్స కరెంటు బిల్లు కట్టలేదా? ఈ వ్యవహారంపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ రఘుమారెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
అది బోగస్ ట్వీట్ అని రఘుమా రెడ్డి స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణనిచ్చారు. సంస్థ పేరుతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై బొత్స కూడా స్పందించారు. తాను కరెంట్ బిల్లు కట్టినా కట్టలేదంటున్నారని బొత్స చెప్పారు. ఫేక్ ఐడీతో… తన కరెంటుబిల్లు గురించి ఈ ట్వీట్ చేశారని బొత్స తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తాను కరెంట్ బిల్ కట్టానని.. ఫ్రూప్స్ చూపించారు .
బొత్స కరెంటు బిల్లు కట్టలేదని ట్వీట్ చేసి ఉన్న ట్విటర్ అకౌంట్ TSSPDCL పేరుపైనే ఉన్నా.. దాన్ని @isocialsaint నిర్వహిస్తోంది. కానీ, TSSPDCL అధికారికంగా నిర్వహిస్తున్న ట్విటర్ ఖాతాను @TsspdclCorporat నిర్వహిస్తోంది. TSSPDCL అధికారిక లోగో ప్రోఫైల్ ఫోటోగా, కవర్ ఫోటో కూడా సేమ్ టు సేమ్ అధికారిక ఖాతాకు ఉన్నట్లే ఉండడంతో అందరూ ఇది అధికారిక ఖాతాగానే భ్రమ పడ్డారు.