ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన వైసీపీ నేతలు…అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని జనం వాపోతున్న సంగతి తెలిసిందే. చెత్తపై పన్ను మొదలు విద్యుత్ చార్జీల పెంపు వరకు ఎడాపెడా జనంపై బాదుడే బాదుడు అన్న రీతిలో అధికార పార్టీ
నేతలు వ్యవహరిస్తుండడంతో జనంలో అసహనం పెరిగిపోయింది. దీంతో, వైసీపీ నేతలకు నిరసన సెగ తగులుతోంది.
కొద్ది రోజుల క్రితం మంత్రి అప్పలరాజు కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. పట్టాలిప్పిస్తానని చెప్పి ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఓ మహిళతోపాటు రైతులు ప్రశ్నించారు. పోలీసులు ఆ మహిళను వారించే ప్రయత్నం చేసినా…మిగతా స్థానికులు పెద్ద సంఖ్యలో కారును చుట్టుముట్టడంతో మంత్రి కారు నుంచి బయటకు రాక తప్పలేదు. ఈ తరహాలోనే తాజాగా నడిరోడ్డుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ను మహిళలు చుట్టుముట్టి నిలదీసిన వైనం వైరల్ అయింది. ఆ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు
స్పందించారు.
రాష్ట్రంలోని మహిళల ఆవేదన ఇలా ఉందంటూ ఆ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. పన్నుల బాదుడు, పెంచిన విద్యుత్ చార్జీలపై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ ట్వీట్ లో ప్రశంసించారు. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? అని నిలదీశారు.
జగన్ జేబు నుంచి ఇచ్చారా? అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేం వాటితో బతుకుతున్నామా? అంటున్న ఆడబిడ్డలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
”శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతుంటే…. కార్మిక లోకం తల్లడిల్లి పోతుంది. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు ఉంది.ఇప్పటికైనా కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి. కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది” అని చంద్రబాబు ట్వీట్ చేస్తూ మే డే శుభాకాంక్షలు తెలిపారు.
పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?(1/2) pic.twitter.com/GLACMD7yZv
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022