కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి నెలల తరబడి తీసిన ఒక సినిమాను మూడు గంటలు థియేటర్ లో కూర్చొని చూసి.. బయటకు వచ్చేసి చెప్పేసే రివ్యూ.. వందల మంది కష్టం మీద ప్రభావం చూపుతుందా? అంటే అవుననే చెప్పాలి. కాలం మారింది. కొత్త తరం వచ్చేసింది. ఇప్పుడు జేబులో ఉండే డబ్బులు ఎంత ముఖ్యమో.. టైం కూడా అంతే ముఖ్యం. చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. చూడాల్సినవి కోకొల్లలు అన్నట్లుగా ఉన్న పరిస్థితి.
గతంలో సినిమా అంటే అపురూపం.
అప్పుడెప్పుడో దూరదర్శన్ తెలుగు ఛానల్ లో కార్యక్రమాలు మొదలైన తర్వాత తొలిసారి టీవీలో ప్రసారమైన సినిమా ‘సుడిగుండాలు’. ఆ సినిమా టీవీలో వస్తుందన్న వార్తతో ఆరోజు సాయంత్రం.. గుంపులు గుంపులుగా టీవీ ముందు కూర్చొని కన్నార్పకుండా చూసిన రోజులు డెబ్భై లో పుట్టిన వారికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేదు. చేతిలో మొబైల్.. దానికో డేటా ఉంటే చాలు.. ప్రపంచంలో ఉన్న విశేషాల్ని చూసే వీలు ఉంటుంది.
కోట్లాది టెరాబైట్ డిజిటల్ కంటెంట్ ఆన్ లైన్ లో ఉంది. అలాంటి వేళ.. ఒక సినిమా కోసం నాలుగు గంటలు. విదేశాల్లో ఉన్న వారైతే ఒక పూట మొత్తాన్ని వదిలేసి.. సినిమాకు రావటమంటే.. దానికి వారెంత ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. అంతలా అభిమానించే సినిమా బాగోకపోతే.. నిర్దాక్షిణ్యంగా ఉతికి ఆరేసినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారు ఇప్పుడు కోకొల్లలు. గతంలో అయితే.. మీడియా ఇచ్చే రిపోర్టులు.. తర్వాతి కాలంలో వెబ్ సైట్లు రాసే రివ్యూలు. ఇప్పుడు కాలం మరింత వేగమైంది. సినిమా చేసేసి.. థియేటర్ బయటకు వచ్చేసి ఆన్ లైన్ లో లైవ్ చెప్పేయటం.. దాన్ని వీడియోగా మార్చి యూట్యూబ్ లోనూ.. ఆ లింకును వాట్సాప్ లో షేర్ చేయటం ఇప్పుడు మామూలైంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ విడుదల కావటం.. నెగిటివ్ టాక్ రావటం తెలిసిందే. అయితే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన కాసేపటికే ప్రవాసాంధ్రుడు ఒకరు షేర్ చేసిన చిట్టి వీడియో సినిమా మీద ఒక అభిప్రాయాన్ని కలిగేలా చేసిందని చెప్పాలి.చిన్నతనం నుంచి ఇప్పటివరకు (వీడియోలోని వ్యక్తి నడి వయసుకు చేరుకున్నట్లుగా ఉన్నారు) మెగాస్టార్ ను అమితంగా ఆరాధించే అతడు.. తాను ఉన్న ప్రాంతంలో ఒక మంచి థియేటర్ లో తన అభిమాన హీరో సినిమా విడుదలైందన్న ఆనందంతో సినిమాకు వచ్చానని.. కానీ రాడ్ అయిపోయిందంటూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసిన మాట వైరల్ అయ్యింది.
వాట్సాప్ లో విపరీతంగా షేర్ అయిన ఈ చిట్టి వీడియోలో వ్యక్తిది సీమ యాసగా ఉండటం.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ నిజాయితీ ధ్వనించటం అతడి మాటల్ని ఇంప్రెస్ అయ్యేలా చేసిందని చెప్పాలి. దీనికి తోడు సినిమా చూసి వచ్చినోళ్లంతా ఈ వీడియోలో ఉన్నది వాస్తవమే అన్న మాట చెప్పటంతో ఈ వీడియో పిచ్చ పాపులర్ అయిపోయింది. పెద్ద పెద్ద మాటలు లేకుండా.. అందంగా మాట్లాడేందుకు ఆయాసపడకుండా.. సాదాసీదాగా మాట్లాడేస్తూ.. అన్నింటికి మించి మనసులో నుంచి వచ్చిన మాటల్ని చెప్పేసిన విధానం అందరిని ఆకర్షించేలా ఉందని చెప్పాలి.
‘‘మనం కూడా పెద్ద ఫ్యానే కదా చిరంజీవికి. ఏం చేద్దాం.. సినిమా రాడ్ అయిపోయింది.. అసలు చిరంజీవి.. రాంచరణ్ ఎలా ఒప్పుకున్నారు సామీ.. కొరటాల శివ ఏం చెప్పి ఒప్పించి ఉంటాడు? ’’ అన్న ఆవేదనతో పాటు.. తనతో పాటు సినిమా చూసి బయటకు వచ్చినోళ్లతో రివ్యూ చెప్పమని అడగటం.. వారు చెప్పిన మాటలకు స్పందిస్తూ.. ‘చిరంజీవి సూపర్.. రాంచరణ్ సూపర్.. నిజమే సామీ.. మరి చిన్నప్పటి చిరంజీవి.. కేక’ అంటూ అతగాడి మాటలు తెలుగు వారిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆచార్య ఫెయిల్యూర్ టాక్ ను వాయువేగంతో వైరల్ చేసిన వీడియోల్లో ఇదొకటిగా చెబుతున్నారు.