తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మాటల మాంత్రికుడు.. కేటీఆర్.. పొరుగు రాష్ట్ర ఏపీపై విరుచుకుపడ్డారు. ఆయనకు ఏమైందో ఏమో కానీ.. ఏపీ ఇజ్జత్ తీసేసేలా వ్యాఖ్యలు సంధించారు. నిజానికి ఏపీ విషయంలో ఎవరు ఎలా ఉన్నప్పటి కీ.. కేటీఆర్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ, శుక్రవారం.. మాత్రం ఏపీలోని పాలనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశా రు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రెమోట్ చేసుకునే సమయంలో ఆయన ఏపీపై విరుచుకుపడడం ఆసక్తిగా మారింది. పైగా ఆయన స్నేహితుడైన వైఎస్ జగన్ పాలనపై నే విమర్శలు సంధించడం ద్వారా.. ఏపీ పరువును నిలువునా తీసేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
`ఏపీలో రోడ్లు లేవు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు. ఇక, సాగుకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక, రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. మీకు ఏమైనా అనుమానం ఉంటే.. ఒక్కసారి పొరుగు రాష్ట్రానికి కారులో వెళ్లిరండి పరిస్థితి మీకు తెలుస్తుంది!“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో రహదారులపై అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సాగుకు కాదు.. తాగేందుకే అక్కడ నీళ్లు దొరకడం లేదు. రోడ్లు గుంతలు పడి.. ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ.. అక్కడి నా మిత్రులే చెబుతున్నారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే.. ఒక్కసారి కారులో వెళ్లి పరిస్థితిని పరిశీలించండి.. అన్నారు.
పొరుగు రాష్ట్రాల కంటే.. మౌలిక సదుపాయాల కల్పనలోనూ.. విద్యుత్, నీరు, వసతులు, రహదారులు ఇలా ఎలా చూసుకున్నా దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టేందుకు అత్యుతమ గమ్యస్థానం హైదరాబాదేనని చెప్పారు.
ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని.. 24/7 తాను అందుబాటులో ఉంటానని.. స్వయంగా ఏసమస్య వచ్చినా..తాను పరిశీలిస్తానని.. అన్నారు. అంతేకాదు.. తన పిట్ట(ట్విట్టర్) ఎప్పుడూ పలుకుతూనే ఉంటుందని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారు.
తెలంగాణలో 111 జీవో ఎత్తివేస్తామని 2014లోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందని, రాబోయే పదేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదని అన్నారు. హైదరాబాద్‌లో మత కల్లోలం లేదని, రాష్ట్రానికి ఏం తేవాలో ప్రతిపక్షానికి అవసరం లేదని.. సీఎం కేసీఆర్‌ను తిట్టడంలోనే ప్రతిపక్షం పీజీ చేసిందన్నారు. పనికిమాలిన విమర్శలు చేయడంలో వాళ్లను మించినవారు లేరన్నారు. ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప..వాళ్లకు ఏమీ తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.