గత కొంతకాలగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. 27వ తేదీన నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీ ప్లీనరీ కారణంగా హాజరుకాలేకపోయారు.
ఇదిలాఉంటే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వచ్చే జూన్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. గత 10 రోజుల్లో 0.15 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. 0.3 శాతానికి పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే జూన్ నాటికి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును మీడియా సంప్రదించగా ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. జూన్ నాటికి కేసులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గతంలో వచ్చినట్టుగా వేల సంఖ్యలో కేసులు వచ్చే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే అందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, సుమారు 93 శాతం మందిలో యాంటిబాడీస్ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మాస్కు ధరించడం కొనసాగించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గురువారం 40 కరోనా కేసులు నమోదయ్యాయని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 14,662 మందికి టెస్టులు చేశామని తెలిపింది. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదని పేర్కొంది.
దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కోలుకున్న వారికంటే.. కొత్త కేసులు అధికమవడం, పాజిటివిటీ రేటు పెరుగుతున్న తరుణంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్నట్లు కన్పించడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ సహా కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు మళ్లీ మాస్క్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి. ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు కేంద్రం పంపిణీ చేసింది.