జగన్ సర్కార్ పై సుప్రీంకోర్టు తాజాగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సాయం నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పరిహారం నిధులను ప్రభుత్వం దారి మళ్లించడంపై దేశపు సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ నిధులను దారి మళ్లించడమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం కోర్టు…సమగ్ర వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు నోటీసులు జారీ చేసింది.
కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కరోనా పరిహారం నిధులను జగన్ సర్కార్ కేటాయించింది. అయితే, ఆ నిధులలో ఏకంగా రూ.1,100 కోట్లను దారి మళ్లించిందని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ఆ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని కూడా వార్నింగ్ ఇచ్చింది.
కాగా, జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ ఆర్థిక స్థితి గాడి తప్పిన సంగతి తెలిసిందే. తన మాట కోసం జగన్ ఖజానాలోని డబ్బులను పప్పు, బెల్లాల మాదిరిగా పథకాలకు పంచిపెడుతున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా పంచిపెట్టడం వల్ల ఆఖరికి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే జగనన్న ఒక శాఖలోని నిధులను మరో శాఖకు మళ్లించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఏపీలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) కింద కేటాయించిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించి పీడీ ఖాతాలకు సదరు నిధులను మళ్లించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ నిధుల వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. కొద్ది రోజుల క్రితం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం… ఆ నిధుల మళ్లింపును నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు రూ.1100 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను దారి మళ్లించడం ఏమిటని సుప్రీం నిలదీసింది.