నెంబర్ వన్ కు చేరడం గొప్ప కాదు. అది నిలుపుకోవడం గొప్ప. నిజమే. తెలుగు న్యూస్ చానల్స్ లో ఎన్టీవీ కొద్ది వారాలుగా నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. తాజాగా ఏప్రిల్ 21, 2022న వచ్చిన వారం రేటింగ్స్ లోను ఎన్టీవీకి 82 రేటింగ్ పాయింట్లు రాగా, టీవీ9- 58, వీ6-30, టీవీ5- 24, ఏబీఎన్ 18 రేటింగ్స్ వచ్చాయి. నెంబర్ వన్ కు టూకి మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. సంతోషమే. కానీ దాన్ని నిలుపుకోవడం ఇప్పుడు ఎన్టీవీకి కత్తిమీద సాములా మారింది. ఆ హడావుడిలో తప్పుల తడక పెరుగుతోంది. వాడిగా వేడిగా న్యూస్ ఇవ్వాలనే తాపాత్రయంలో మూలాలను మర్చిపోతోంది. ఫలితంగా ఆ చానల్ ను తిట్టుకునే వారి శాతం పెరుగుతోంది. వర్షం వచ్చినప్పుడు రుధిరం, రణం, రౌద్రం వంటి వార్తలను చదివి టీవీ9 అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీవీ ఏ మాత్రం తీసిపోలేదు. అంతకు మించి అంటోంది. తగ్గేదేలే అని తీరులో పొరపాట్లు దొర్లుతున్నాయి. పెరుగుట విరుగుడ కొరకే అనే సామెతను గుర్తుకు తెప్పిస్తోంది. అతి సర్వత్ర వర్జయేత్. అంటే ఏ విషయంలోను అతిగా ఉండకూడదు అని అర్ధం.
ఎన్టీవీ వార్తలు..టీవీ5కి వెల్ కమ్..
అతి ఎల్లప్పుడూ శ్రేయోస్కారం కాదు. ఇప్పుడు ఎన్టీవీలో పని చేస్తున్న యాంకర్ రేచల్ ఇటీవల వెల్ కమ్ టూ టీవీ5 న్యూస్ అంటూ చదవడంతో అవాక్కవడం వీక్షకుల వంతైంది. గతంలో ఆ యాంకర్ టీవీ5లో పని చేయడమే ఇందుకు కారణం. అంతెందుకు టీవీ5లో పని చేస్తున్న ప్రముఖ యాంకర్ మూర్తి సైతం ముగింపులో ఇదీ ఇవాల్టి సంగతి. చూస్తూనే ఉండండి ఏబీఎన్ న్యూస్ అన్నాడు. అతనే కాదు చానల్ మారినా చాలా మంది న్యూస్ ప్రజెంటర్లు కొత్తలో కొన్ని సార్లు ఇలా చదవడం కొత్తేం కాదు. లైవ్ లో ఉన్నప్పుడు సహజంగానే న్యూస్ ప్రజెంటర్ పై ఒత్తిడి ఉంటోంది. ఆ కోణంలో తప్పులు కాదు కానీ పొరపాట్లు దొర్లుతాయి. తెలిసి చేసేది తప్పు. తెలియకుండా జరిగేది పొరపాటు. ఇప్పుడు ఎన్టీవీలో వచ్చిన వెల్ కమ్ టు టీవీ5ను ఏమనుకోవాలో మరి.
అంతేనా..మంత్రుల పోర్ట్ పోలియోలు మార్చి..
అదొక్కటే అయితే ఎన్టీవీ గురించి చెప్పుకోవడం ఎందుకు. ఈ మధ్య జగన్ 2.0 కేబినెట్ అంటూ ఫోటోలు పెట్టి మరీ ఎన్టీవీ న్యూస్ ను ప్రజెంట్ చేసింది. మంత్రులు పోర్టు ఫోలియోలను ఇచ్చింది. అందులో అంజాద్ బాషాకు దేవదాయశాఖను ఇచ్చినట్లు ప్రసారం చేసింది. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్ బాషాకు హిందూ సంప్రదాయానికి సంబంధించిన దేవదాయశాఖ ఇచ్చారా అనుకున్నారు అది చూసిన జనం. హవ్వా ఇది టీవీ9 కంటే దారుణంగా తయారైందే అని చర్చించుకోవడం కనిపించింది. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆయన స్థానంలో అంజాద్ బాషా ఫోటో వేయడమే కాదు. కింద దేవదాయశాఖ మంత్రి అని ఆకర్షణీయమైన క్యాప్సన్ పెట్టడం హాట్ టాపికైంది. ఎన్టీవీకి ఏమైంది. ఇప్పుడు ఇలా చేస్తుందనుకుంటున్నారంతా. నెంబర్ వన్ గా హఠాత్తుగా రేటింగ్ రావడమే ఇందుకు కారణమంటున్నాయి మీడియా సర్కిల్స్.
విదేశాలకు పంపలేదు..
ఉక్రెయిన్-రష్యా వార్ కవరేజ్ కోసం టీవీ9, సాక్షి టీవీలు తమ ప్రతినిధులైన మహాత్మ, హసీనా, ఇస్మాయిల్ ను అక్కడకు పంపాయి. బాగా కవర్ చేశాయి. ఆ తర్వాత టీవీ9 అశోక్ శ్రీలంకకు వెళ్లి అక్కడి అంతరుద్ధ్యం గురించి ఇచ్చాడు. కానీ ఎన్టీవీ ఇలాంటి ప్రయోగాలేమి చేయలేదు. అయినా నెంబర్ వన్ లో ఉండటం ఆశ్చర్యం.
బార్క్ రేటింగ్స్ తో ఎన్టీవీ హడావుడి పెరిగింది. తామే నెంబర్ వన్ అని చెప్పుకునే ప్రయత్నం బాగానే చేస్తోంది. డిజిటల్ లో ఎన్టీవీ ఎప్పుడూ అగ్రస్థానంలో లేదు. ఆ మాట కొస్తే వెబ్ సైట్లు, యూట్యూబ్, అర్బన్ లో ఎన్టీవీకి పెద్దగా స్థానమే లేదు. బులిటెన్లో యాంకర్లు తప్పులు చదువుతుండటం చూస్తున్నాం. బేసిక్ గా ఇన్ని తప్పులు చేస్తున్న చానల్ కు నెంబర్ వన్ ఎలా వచ్చిందబ్బా అనేదే ప్రశ్న. కాపీ పేస్ట్ చేసే సంస్కృతి ఆ చానల్ లో ఉంది. తప్పులను అలానే చదివే యాంకర్లు లేకపోలేదు. ఓన్లీ రూరల్ ఏరియాలో ఆ చానల్ చూసే వారుంటే నెంబర్ వన్ రావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. వచ్చిన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఆ చానల్ పావులు కదిపితే సరే. లేకపోతే నెంబర్ వన్ గతమే అనుకోవాల్సి వస్తుంది.