తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్ అనుమానాల తేనెతుట్టేను కదిపింది. పెద్దగా న్యూస్ ఇచ్చింది లేదు. వైరెటీ ప్రంజెంటేషన్ లేదు. డిజిటల్ లో వెనుకబాటు. వెబ్ సైట్ లోను దిగదుడుపు. యూట్యూబ్ లైవ్ వీవర్స్ తక్కువే. అర్బన్ లో ఆ చానల్స్ రేటింగ్స్ నాలుగు స్థానాలకు దిగువనే. రూరల్ ఏరియా తప్ప మరెక్కడా లేదు. ప్రజెంటేషన్ లో తప్పుల తడక. వేరే పత్రికలను చూసి మరీ కాపీ కొట్టడం వారి శైలి. మొత్తంగా ఇలా ఉంటేనే నెంబర్ వన్ వస్తుందేమో అనిపించేలా ఉన్న తీరు ఇప్పుడు హాట్ టాపికైంది.
ఎన్టీవీ నెంబర్ వన్. తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్ లో. నిజమే. ఎవరూ కాదన్నా ఊరుకునేది లేదు. ఎందుకంటే బార్క్ రేటింగ్స్ అవే చెబుతున్నాయి. ఇందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. కానీ అది ఎలా వచ్చిందనేది చాలా మందిలో మెదిలే బాహుబలి ప్రశ్న. మిగతా న్యూస్ చానల్స్ లో లేనిది ఆ చానల్ లో ఉంది ఏంటి. కంటెంట్ ఎలా ఉంది. ప్రజెంటేషన్ ఎలా ఉంది. అప్ డేట్స్ ఎలా వస్తున్నాయి. ఎందుకు అంతగా పొజిషన్ మారిందనే చర్చ జరుగుతోందిప్పుడు. సందేహం ఎందుకు. పదండి. ఒక్కసారి దాన్ని విశ్లేషించే పని చేద్దాం.
ఒకప్పుడు ప్రింట్ మీడియాదే రాజ్యం. ఇప్పుడు దాని హవా తగ్గింది. అంతా డిజిటల్ యుగమై పోయింది. సెల్ పోన్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లు వచ్చేశాయి. టీవీలతో పాటు వీటి వినియోగమే ఎక్కువైంది. పొద్దున నిద్ర లేస్తూనే పక్కనున్న సెల్ పోన్ పట్టుకోవడం అలవాటుగా మారింది. ఎక్కడెక్కడ ఏం జరిగింది. ఏమేమి వార్తలు ఉన్నాయి. సినిమా, క్రైమ్, స్పోర్ట్స్, పొలిటికల్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటి. వెబ్ సైట్లలో ఏమొచ్చాయి. యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు ఉన్నాయి. ఏవి ట్రెండింగ్ అవుతున్నాయి. మరెలాంటివి వైరల్ అవుతున్నాయి. ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకు వస్తున్నాయి అనే సెర్చ్ చేయడం మొదలైంది. ముందు మన ఏరియాలో ఏం జరుగుతోంది. ఎందుకు అలా జరిగింది. ఏంటని ఆరా తీయడం ఇప్పటి తరం పనైంది. వాట్సాప్, టెలిగ్రామ్ యూనివర్సిటీలో ఎలాంటి న్యూస్ షేర్ అవుతున్నాయి. ఏంటనేది తెలుసుకునే ఆసక్తి పెరిగింది. పడుకునే ముందు వరకు సేమ్ సీన్ రిపీట్. సెల్ పోన్లో అప్ డేట్ న్యూస్ చూడందే పడుకునే పరిస్థితి లేదు. అంతగా ప్రజలకు కనెక్ట్ అయింది డిజిటల్ వ్యవస్థ.
టీవీల్లో వీక్షకులను కొలిచే సాధనం బార్క్. గతంలో టామ్ ఉండేది. మీటర్స్ లిమిటెడ్ గా ఉండేవి. కొన్ని స్పెసిపిక్ ఏరియాలో మాత్రమే వాటిని పెట్టేవాళ్లు. దానికి సరైన శాస్త్రీయత లేదనే వాదనుంది. దాన్ని పక్కన పెట్టి బార్క్ రేటింగ్స్ వైపు మళ్లాయి టీవీ చానల్స్. అదే సమయంలో బార్క్ వాళ్లు శాంపిల్స్ ను పెంచడంతో గురి కుదిరింది. శాంపిల్స్ ఎంత పెంచినా 5 వేలకు మించి పెట్టడం లేదు. ఆ శాంపిల్స్ నే మొత్తం వీక్షకుడి ఒపీనియన్ గా మారింది. టామ్ కంటే బెటరే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాటిని పెట్టే తీరులోనే తేడా వస్తుందా అనే సందేహాలు ముసురుకుంటున్నాయి.
అనుమానాలు ఎందుకంటే…
తెలుగు న్యూస్ చానల్స్ లో డిజిటల్ లో నెంబర్ వన్ గా ఉండేది ఎన్టీవీ కాదు. అందులోను యూట్యూబ్ లో ఎన్టీవీ వ్యూవర్ షిప్ మిగతా చానల్స్ తో పోల్చుకుంటే తక్కువే. ఏదో నోటికి వచ్చినట్లు చెప్పడం లేదు. లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఒక అవగాహనకు వచ్చి చెబుతున్నా. ఇందుకు తగ్గ ఆధారాలను మీ ముందు ఉంచే ప్రయత్నం
యూట్యూబ్ లైవ్ వీవర్స్ వీరులెవరంటే..
ఉదాహరణకు…ఏప్రిల్ 23, 2022న ఉదయం 8.30 నుంచి 8.40 లోపు తెలుగు న్యూస్ చానల్స్ లో యూట్యూబ్ లైవ్ వాచింగ్ వ్యూవర్స్ ను చూస్తే ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆ టైమ్ లో టీవీ9ను 6,400 మంది, ఎన్టీవీని 2,964 మంది వీ6ను 2,774 మంది, ఏబీఎన్ ఆంద్రజ్యోతి 1,426 మంది, సాక్షిటీవీ 1,125 మంది, టీవీ5ను 756 మంది, 10టీవీను 456 మంది, ఈటీవీ తెలంగాణను 187 మంది చూస్తున్నారు. ఇందుకు తగ్గ ఫోటోల ఆధారాలను మీ ముందు ఉంచుతున్నా. నెంబర్ వన్ గా ఉన్న చానల్ కు నెంబర్ టూగా ఉన్న చానల్ కు మధ్య వీవర్ షిప్ తాడా 3,436 మంది. ఇది ఒక టైమ్ లో తీసుకున్న శాంపిల్. ఆ ఒక్క టైమ్ లోనే కాదు..మిగతా సమయాల్లో తీసుకున్నా దాదాపు కాస్త అటో ఇటో తప్ప తేడా పెద్దగా ఏమి లేదు.
ఆశ్చర్యం ఏంటంటే..
మిగతా చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ నడిచేటప్పుడు ఎన్టీవీలో రుద్రాక్షలు యాడ్ వస్తుంటే అదే ఎక్కువ మంది చూస్తున్నారని బార్క్ రేటింగ్స్ ఇచ్చింది. బార్క్ రేటింగ్ ను తప్పు పట్టడం లేదు. వీక్షకులు ఉన్నారేమో. కానీ సాధారణంగా న్యూస్ వచ్చేటప్పుడు దాన్నే ఎక్కువ మంది వీక్షకులు చూసే వీలుంది. బ్రేకింగ్ న్యూస్ ను పక్కన పెట్టి మరీ రుద్రాక్షలు, నెప్తాల్ యాడ్ ను చూసే వాళ్లు ఉంటారా అనే సందేహం వస్తోంది. అందులోను వనితా చానల్ రేటింగ్స్ లోకి రావడంతో అసలు బార్క్ రేటింగ్స్ ఏంటి. ఎలా వస్తాయి. ఎవరిస్తారు. అవే ఎందుకు వస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఎన్టీవీకి ఈ మధ్య కాలంలో వెబ్ సైట్ బలం తోడైంది. దాన్ని కాదనలేము. దాని వల్ల మరింత ప్లస్ పాయింట్ అయిందనేది కొందరు చేసే వాదన. దాన్ని కూడా విశ్లేషించే పని చేద్దాం…
వెబ్ సైట్ లో కింగ్ లా…
తెలుగులో నెంబర్ వన్ వెబ్ సైట్ టీవీ9 తెలుగు. డెయిల్ హంట్ కాకుండా నెలకు 15 నుంచి 16 మిలియన్ వ్యూస్ ఆ వెబ్ సెట్ కు వస్తుంటాయి. డెయిల్ హంట్ తో లెక్కేస్తే 19 మిలియన్స్ వరకు వ్యూస్ ఉన్నాయి. ఇటీవల కాలం వరకు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న న్యూస్ 18 వెబ్ సైట్ ఇప్పుడు నెంబర్ టూకు చేరింది. ఆ వెబ్ సైట్ కు 12 నుంచి 13 మిలియన్స్ వీక్షకులు ఉండగా..ఆ తర్వాత స్థానాల్లో సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు చేరాయి. సాక్షి వీవర్స్ 13 నుంచి 14 మిలియన్స్, ఈనాడుకు 10 నుంచి 12 మిలియన్స్, ఇక ఆంధ్రజ్యోతికి 5 నుంచి 6 మిలియన్స్ వ్యూవర్ షిప్ ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వాటి వీవర్ షిప్ ను చూసిన ఎవరికైనా అర్థమవుతోంది. కానీ ఎన్టీవీ వెబ్ సైట్ ఇంకా టాప్-5 స్థానాల రేసులోను లేదు. కానీ వీవర్ షిప్ ఎలా పెరిగిందనే చర్చ జరగడంలో తప్పేమి లేదు.
అర్బన్ లో చూద్దాం…
అర్బన్ లో ఎన్టీవీ రేటింగ్ చాలా తక్కువగా ఉంది. హైదారాబాద్ లాంటి చోట్ల అయితే నెంబర్ వన్ లో టీవీ9, రెండు, మూడు స్థానాల్లో వీ6, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి అటు ఇటు మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా వస్తున్న రేటింగ్స్ ను గమనిస్తే ఇదే తెలుస్తోంది. ఎన్టీవీకి దాదాపు నాలుగో స్థానం వస్తోంది. అలాంటి చానల్ నెంబర్ వన్ రావడం మాములు విషయం కాదు. ఇక్కడ డబ్బులిచ్చి రేటింగ్స్ ను మేనేజ్ చేశారని అనకూడదు. బార్క్ రేటింగ్ ఇచ్చింది కాబట్టి అనుమానం అక్కరలేదు. అంతా నిజమే. అందులోను వనితా చానల్ రేటింగ్స్ లోకి దూసుకువచ్చింది. ఆ చానల్స్ ఎక్కడ వస్తుంది. ఏమి ప్రొగ్రామ్స్ ఇస్తుందని ఈ మధ్య చాలా మంది ప్రెండ్స్ చర్చించుకోవడం కనిపిస్తోంది.
డిటో దించేస్తుందా…
ఎన్టీవీ వార్తల్లో ఉండే కంటెంట్ కొంత పేపర్స్ నుంచి లిప్ట్ చేసి నేరుగా కాపీ, పేస్ట్ చేస్తున్నారని మీడియా సర్కిల్ లో జరుగుతున్న చర్చ. ఆ మాటకొస్తే చాలా చానల్స్ అవే పని చేస్తున్నాయి. ఊరికే అనుకోవడం కాదు. నిజమేంటో చూద్దాం. ఈ మధ్య నల్గొండ జిల్లాలో జరిగిన పరువు హత్య వార్తను చూద్దాం. ఏప్రిల్ 18, 2022న ఎన్టీవీలో సాయంత్రం 7.31-7.58 నిమిషాల వరకు ప్రసారం అయిన ప్రేమ ఖరీదు ప్రాణం ( మాజీ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పరువు హత్య) ఫోకస్ ను చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన పేరాలకు పేరాల కంటెంట్ ఏమాత్రం మార్చకుండా ప్రజెంట్ చేయడం ఆశ్చర్యమే. ఎన్టీవీలో కంటెంట్ రాసేవాళ్లు లేరా అంటే ఉన్నారనే సమాధానం వస్తోంది. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చిన వార్తను మక్కికి మక్కీ ఎందుకు మార్చకుండా వాడేరో అర్థం కాని ప్రశ్న.
https://www.andhrajyothy.com/telugunews/murder-in-yadadri-district-ngts-telangana-1822041802192385
రూరల్ పోకసింగ్…
ఎన్టీవీలో రూరల్ పోకసింగ్ ఎక్కువే. చిన్న చిన్న వార్తలను వదలకుండా ఇవ్వడం చూస్తున్నాం. రూరల్ సెక్టార్ ను మిస్ కాకుండా చూస్తున్నారు వాళ్లు. మిగతా వారితో పోలిస్తే స్పీడ్ న్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. జమే. కాదనలేని సత్యం.
పొలిటికల్ వార్తలు ఇవ్వడంలో ఎన్టీవీ మిగతా వారి కంటే పోకసింగ్ గా ఉంది. కానీ ప్రజెంటేషన్ విషయంలో ఎన్టీవీతో పోల్చుకుంటే మిగతా చానల్స్ బాగున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కిసాన్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు సాయి గణేష్ ఆత్మహత్య విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ పై ఆరోపణలు వచ్చాయి. మంత్రి పై పోకస్ విషయంలో మిగతా చానల్స్ కంటే అగ్రెసివ్ గా టీవీ9 వెళ్లింది. అధికార పార్టీకి కొమ్ముకాస్తుందనే విమర్శలను పక్కన పెట్టేందుకే ఈ పని చేసిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వాల పరంగా వచ్చే ఇలాంటి వార్తలను మోహమాటం లేకుండా ప్రజెంట్ చేసినప్పుడే ఆ చానల్స్ ను వీక్షకులు ఇష్టపడతారనేది వాస్తవం.
తెలుగు వెబ్ సెట్, యూట్యూబ్, డెయిల్ హంట్ , అర్బన్ లో పెద్దగా ప్రభావం చూపలేని ఎన్టీవీ నెంబర్ వన్ న్యూస్ చానల్ కాకా లేనిది. మిగతా చానల్స్ త్వరలో నెంబర్ వన్ ఎందుకు అవ్వకూడదనే చర్చ నడుస్తోంది. విషయం ఏదైనా రేటింగ్ మాయా జాలం కంటే వీక్షకుల సంఖ్య ఎక్కువ ఎవరిది ఉంటే వారిదే నెంబర్ వన్ అని ప్రజల అభిప్రాయం.