ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పీకే…కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై సోనియా గాంధీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని పీకే సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది.
దీంతో, ఆ వ్యవహారంపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసిచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు వైసీపీ సిద్ధమని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏ పార్టీకైనా మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత ఏ కూటమికి వైసీపీ ఎంపీల మద్దతు అవసరమైనా సహకరిస్తామని అన్నారు.
కానీ, 2024 ఎన్నికలకు ముందే వారు ప్రత్యేక హోదా గురించి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పేర్ని నాని మెలిక పెట్టారు. అంతేకాదు, వైసీపీని ఎవరూ శాసించలేరని, పీకే తమ పార్టీకి కన్సల్టెంట్ మాత్రమేనని, ఆయన ఆలోచనలను తాము వాడుకుంటామని చెప్పారు. వైసీపీకి పొత్తులు అవసరం లేదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తున్న పీకే…కాంగ్రెస్తో పొత్తు విషయాన్ని పలుమార్లు విజయసాయిరెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చిన జగన్…కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు, వైసీపీ అధినాయకత్వంలో మాట్లాడకుండానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన చేసి ఉంటారని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నాకే జగన్తో మాట్లాడవచ్చని పీకే అనుకున్నారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా…జగన్ కు చెప్పకుండా పీకే ఇటువంటి సూచన చేసే చాన్సే లేదని చెబుతున్నారు.