‘అఖండ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో నందమూరి నటసింహం, మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా అఖండతో కరోనా కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ కు కొత్త జోష్ ఇచ్చారు బాలయ్య. అఖండ తర్వాత వరుసగా సినిమాలను పట్టాలెక్కించిన బాలయ్య….వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు.
‘అఖండ’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువ స్టార్ హీరోలతో పోటీపడుతున్న బాలయ్య బాబు…గోపీచంద్ మలినేని, కొరటాల శివ, సంపత్ నంది, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులతో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మాస్ డైరెక్టర్ గా మంచి పేరున్న గోపీచంద్ మలినేని, మాస్ కా బాప్ బాలయ్యల కాంబోలో రాబోతోన్న చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయి. బాలకృష్ణ మోకాలికి డాక్టర్లు సర్జరీ చేశారని ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యులే ధృవీకరించారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లపై బాలకృష్ణ ప్రతినిధులు స్పందించారు. బాలయ్యకు సర్జరీ జరిగిందంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.
రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని వెల్లడించారు. దయచేసి బాలకృష్ణ గురించి అవాస్తవ వార్తలను వ్యాప్తి చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన షూటింగ్‌లోనూ బాలకృష్ణ పాల్గొన్నారు.