ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపి టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడును జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అచ్చెన్నాయుడును నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నిమ్మాడ లో అరెస్ట్ చేసిన అచ్చెన్నను కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ కు తరలించారు. నామినేషన్ వేయనీయకుండా సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించారంటూ వైసిపి నాయకుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అరెస్టు చేశారని చెబుతున్నారు. అచ్చెన్నకు వైద్య పరీక్షల అనంతరం అంపోలు జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోటబొమ్మాళఇ పోలీస్ స్టేషన్ కు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు..
ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారని, అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది వైసీపీ నేతలని ఆరోపించారు. అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి రెచ్చగొట్టారని, వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఐపిసి లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..? అని ప్రశ్నించారు.
రామతీర్ధం ఘటనలోనూ కళా వెంకట్రావుపై, తనపై, అచ్చెన్నాయుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి 83రోజులు అక్రమ నిర్బంధం చేశారని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా 5జిల్లాల్లో 20గంటలు 700కిమీ తిప్పించి మళ్లీ ఆపరేషన్లకు కారణం అయ్యారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి కుంభకోణాలు బైటపెట్టడమే అచ్చెన్నాయుడు చేసిన నేరమా…?అని ప్రశ్నించారు. దీనికి జగన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని, వైసిపి పుట్టగతులు కూడా లేకుండా పోతుందని ధ్వజమెత్తారు. తక్షణమే అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.